అన్నదాతల పరిస్థితిని వివరించాం, రైతు చట్టాలను రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరాం, రాహుల్ గాంధీ
రైతు చట్టాలను రద్దు చేయాలని తాము రాష్ట్రపతిని కోరామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. 13 రోజులుగా రైతులు ఢిల్లీ శివార్లలో గజగజ వణికించే చలిలో ఆందోళన చేస్తున్న విషయాన్ని..

రైతు చట్టాలను రద్దు చేయాలని తాము రాష్ట్రపతిని కోరామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. 13 రోజులుగా రైతులు ఢిల్లీ శివార్లలో గజగజ వణికించే చలిలో ఆందోళన చేస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చామన్నారు. బుధవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని రాహుల్ తో బాటు ఎన్సీపీ నేత శరద్ పవార్, సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డీ.రాజా, డీఎంకే నాయకుడు ఇలంగోవన్ కలిశారు. ఈ మేరకు ఓ మెమోరాండం సమర్పించారు. రైతు చట్టాలు అన్నదాతలకు మేలు చేసేవి కావని, ఇవి వారికీ అవమానకరమైనవని చెప్పామని రాహుల్ తెలిపారు. అలాగే విద్యుత్ సవరణ బిల్లును కూడా రద్దు చేయాలని తాము కోరినట్టు సీపీఎం నేత సీతారాం ఏచూరి చెప్పారు.
ఇలా ఉండగా రైతు చట్టాలకు సవరణలు చేస్తూ కేంద్రం రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలను రైతులు తిరస్కరించడమే కాకుండా దేశ వ్యాప్త ఆందోళనకు సిధ్ధపడుతున్నారు. మరి కేంద్రం వీరి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందేమో చూడాల్సి ఉంటుంది.



