కేరళ వయనాడ్ విలయం.. హృదయ విదారకంగా మారింది. చురాల్‌మలైలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. వర్షం, వరదలు తగ్గుముఖం పట్టడంతో.. బురదను తొలగించే పనులు ప్రారంభం అయ్యాయి. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్స్.. సహాయక చర్యల్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఒకవైపు గాయాలైన వారిని ఆస్పత్రులకు తరలించడంతో పాటు.. మరోవైపు రాళ్లు, బురదలో కూరుకుపోయిన చనిపోయిన వారి మృతదేహాలు బయటకు తీస్తున్నారు. బురదలో కూరుకుపోవడంతో.. అవి ఎవరివన్నది గుర్తించడం కష్టంగా మారింది. దీంతో ఆస్పత్రుల్లో ప్రత్యేక ఫ్రీజర్లు ఏర్పాటు చేశారు.
వయనాడ్ వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో.. 2 ఊళ్లు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. చూరాల్‌మలై, ముండక్కాయ్ గ్రామాలపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. చూరాల్‌మలై ఈ విలయానికి దారుణంగా దెబ్బతింది. సగం ఇళ్లు కొట్టుకుపోయాయి. మిగతా ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. 400 ఇళ్లుంటే అందులో సగం ఆనవాళ్లు కోల్పోయాయి. ఆర్మీ అధికారుల విడుదల చేసిన డ్రోన్ ఫుటేజీలో.. ఈ విషయం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.
@IndiaCoastGuard is actively engaged in the rescue and relief operations for those affected by the landslide in #Wayanad. ICG Disaster Relief Team #DRT ex #Kochi & #Beypore are on the ground, providing aid and support. #ICG is committed to ensuring the safety and well-being of… pic.twitter.com/8qvtdyvitB
— Indian Coast Guard (@IndiaCoastGuard) July 31, 2024
ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అంతా చురాల్‌మలైలోనే కొనసాగుతోంది. ఇక్కడి నుంచి 100 అడుగుల పైన ముండక్కై గ్రామం ఉంది. ఇక్కడికి వెళ్లేందుకు.. అన్ని దారులు క్లోజ్ అయ్యాయి. దీంతో కృత్రిమ వంతెనను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నారు ఆర్మీ అధికారులు. భారీ ఇనుపరాడ్లతో.. వంతెన నిర్మాణం సాగుతోంది. ఇది పూర్తయితేనే.. ముండక్కై వెళ్ళే వీలుంది. అక్కడికి వెళ్తేనే ఎంతమంది మిస్సయ్యారు. ఎంతమంది చనిపోయారు అన్న క్లారిటీ వస్తుంది. ముండక్కై చుట్టూ బురద చుట్టేయడంతో.. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందంటున్నారు స్థానిక అధికారులు.
ఎగువ నుంచి కొండచరియలు, బురద విరుచుకుపడిన చోట పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. కొండ ప్రాంతాల నుంచి.. ఒక్కసారిగా వచ్చిన వరద ఊళ్లను ముంచేసింది. వయనాడ్‌లోని కొండ ప్రాంతాల్లో టీఎస్టేట్‌లు భారీగా ఉన్నాయి. ఇక్కడే పనిచేస్తూ, నివాసముంటున్న వాళ్లలో చాలామంది ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. హెలికాఫ్టర్ల సాయంతో ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
వయనాడ్‌లో వందలాది వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక్కడ తలదాచుకుంటున్న వారి కుటుంబాల్లో చాలామంది ఆచూకి ఇప్పటికీ తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. వయనాడ్‌లోని పలు గ్రామాల యువకులు వాలంటీర్లుగా వరద బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. బాధితులకు కావాల్సిన ఆహారం తదితర ఏర్పాట్లు చూస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..