సోనియా ఎంట్రీతో ఉత్తమ్ ఎగ్జిట్ తప్పదా..!
సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న పార్టీని మళ్లీ గట్టెక్కిచేందుకు ఏఐసీసీ పగ్గాలు మళ్లీ సోనియానే తీసుకున్నారు. బాధ్యతలు తాత్కాలికమే అయినా పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకే సోనియాను ఒప్పించారట హైకమాండ్ పెద్దలు. ఇక సోనియా పార్టీ ప్రక్షాళనపై ఫోకస్ పెడతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పడు టీ పీసీసీలో హీట్ పెరుగుతోంది. తెలంగాణ ఇచ్చినా.. రెండు సార్లు అధికారానికి దూరమయ్యామనే బాధలో ఉన్నా సోనియా తెలంగాణ పీసీసీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే టెన్షన్ లో ఉన్నారు హస్తం […]
సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న పార్టీని మళ్లీ గట్టెక్కిచేందుకు ఏఐసీసీ పగ్గాలు మళ్లీ సోనియానే తీసుకున్నారు. బాధ్యతలు తాత్కాలికమే అయినా పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకే సోనియాను ఒప్పించారట హైకమాండ్ పెద్దలు. ఇక సోనియా పార్టీ ప్రక్షాళనపై ఫోకస్ పెడతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పడు టీ పీసీసీలో హీట్ పెరుగుతోంది. తెలంగాణ ఇచ్చినా.. రెండు సార్లు అధికారానికి దూరమయ్యామనే బాధలో ఉన్నా సోనియా తెలంగాణ పీసీసీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే టెన్షన్ లో ఉన్నారు హస్తం నేతలు.
రాష్ట్రంలో కాంగ్రెస్ కాస్త ఢీలా పడగానే కమలం పార్టీ నేతలు దూకుడు పెంచుతున్నారు. హస్తం లీడర్లంతా తలోదారి చూసుకుంటున్నారు. దీంతో ఈసారి తెలంగాణ పీసీసీ చీఫ్ విషయంలో సోనియా బలమైన నేతకే పగ్గాలు ఇస్తారనే టాక్. అయితే ఇప్పడున్న ఉత్తమ్ ను కొనసాగిస్తారా…లేదా మరో నేతను సీన్ లోకి తెస్తారా అనేది తెలంగాణ పొలిటికల్ సెంటర్ లో చర్చనీయంశంగా మారింది.
నిజానికి సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఉత్తమ్ టీఎస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. ఆపై రాహుల్ నాయకత్వంలో పనిచేశారు. 2018 ఎన్నికల్లో మహాకూటమి ప్రయోగం మీద 10 జనపథ్ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. కానీ…జరిగింది మాత్రం వేరు. నాటి నుంచి ఉత్తమ్‌ని తొలిగించాలన్న డిమాండ్ ఆయన వ్యతిరేక వర్గం నుంచి పెరుగుతూ వస్తోందట. ఇప్పుడు సోనియాగాంధీ ప్రక్షాళన మంత్రం చదవడం ఖాయమన్న సంకేతాలు బలంగా అందుతూ ఉండటంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గంలోనూ టెన్షన్ పెరుగుతోందట.
మరోవైపు తెలంగాణ పీసీసీ బాధ్యతలు లక్ష్యంగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డితో పాటు మరికొంత మంది నేతలు అమ్మను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారట. ప్రక్షాళనలో మొదటగా తెలంగాణపైనే సోనియా నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోందట. దీంతో…ఉత్తమ్‌ని మార్చడమే ప్రక్షాళన అని సోనియా భావిస్తారా ? లేక ఉత్తమ్‌ని కొనసాగిస్తూనే…టీఆర్‌ఎస్, బీజేపీలను ఎదుర్కొనే వ్యూహాలను మారుస్తారా ? అన్న దానిపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోందట.