ప్రధాన మంత్రి వయో వందన యోజన పథకం మరోసారి పొడిగింపు..?

60 ఏళ్లు దాటిన పెద్దలకు జీవితంపై భరోసా కల్పించే ఉద్దేశంలో భాగంగా ప్రధాన మంత్రి వయో వందన యోజన (PMVVY) పింఛను పథకం దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. దీనికి స్వల్ప మార్పులు చేసి నేటి నుంచి కొత్త పాలసీలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎల్‌ఐసీ తెలిపింది. ఇందులో గరిష్ఠంగా రూ.15 లక్షలు డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఈ పథకం 2023 మార్చి వరకు అందుబాటులో ఉంటుంది. ఆఫ్‌లైన్‌తో పాటు ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఈ పథకంలో చేరవచ్చని ఎల్‌ఐసీ […]

ప్రధాన మంత్రి వయో వందన యోజన పథకం మరోసారి పొడిగింపు..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 26, 2020 | 3:00 PM

60 ఏళ్లు దాటిన పెద్దలకు జీవితంపై భరోసా కల్పించే ఉద్దేశంలో భాగంగా ప్రధాన మంత్రి వయో వందన యోజన (PMVVY) పింఛను పథకం దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. దీనికి స్వల్ప మార్పులు చేసి నేటి నుంచి కొత్త పాలసీలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎల్‌ఐసీ తెలిపింది. ఇందులో గరిష్ఠంగా రూ.15 లక్షలు డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఈ పథకం 2023 మార్చి వరకు అందుబాటులో ఉంటుంది. ఆఫ్‌లైన్‌తో పాటు ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఈ పథకంలో చేరవచ్చని ఎల్‌ఐసీ వివరించింది. ఈ పాలసీ 10 ఏళ్లు కాలావధితో ఉంటుంది. 2021 మార్చి ఆర్థిక సంవత్సరంలోపు కొనుగోలు చేసే పాలసీలకు 7.4 శాతం వార్షిక వడ్డీ రేటు అందిస్తారు. ఈ వడ్డీ ప్రతి నెలా పింఛను రూపంలో పాలసీదారులకు అందుతుంది. ఆ తర్వాత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 2022, 2023 మార్చి లోపు విక్రయించే పాలసీలకు ఆయా ఆర్థిక సంవత్సరాల ప్రారంభంలో ప్రభుత్వం వడ్డీ రేటు నిర్ణయిస్తుందని ఎల్‌ఐసీ తెలిపింది. ఈ పథకంలో చేరేందుకు పింఛనుదారు నెలవారీ/త్రైమాసిక/అర్ధవార్షిక/వార్షిక ప్రాతిపదికన వడ్డీ చెల్లింపు ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. నెలవారీ ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే కనీసం రూ.1,62,162, త్రైమాసిక ఆప్షన్‌ ఎంచుకుంటే రూ.1,61,074, అర్ధవార్షిక ఆప్షన్‌లో రూ.1,59,574, వార్షిక ఆప్షన్‌ అయితే రూ.1,56,658 కనీస మొత్తానికి పాలసీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో గరిష్ఠంగా రూ.9,250 నెలవారీ పింఛను అందుకోవచ్చు. త్రైమాసిక ప్రాతిపదికన రూ.27,750, అర్ధవార్షిక ప్రాతిపదికన రూ.55,000, వార్షిక ప్రాతిపదికన రూ.1,11,000 చొప్పున చెల్లింపులు ఉంటాయని ఎల్‌ఐసీ తెలిపింది. గతంలో ఈ పథకంలో చేరే పెద్దలకు 8 శాతం వడ్డీ ఇస్తుండగా, నెలకు గరిష్ఠంగా రూ.10,000 పింఛను అందేది. ఇప్పుడు దాన్ని 7.4 శాతానికి తగ్గించడంతో నెలవారీ గరిష్ఠ పింఛను రూ.9,250కి తగ్గుతోంది. పాలసీ కొనుగోలు చేసిన మూడేళ్ల తర్వాత దీనిపై 75 శాతం వరకు రుణం పొందే సదుపాయం కూడా ఎల్‌ఐసీ కల్పిస్తోంది. అంతే కాకుండా పాలసీదారులకు లేదంటే వారి భాగస్వాములకు తీవ్ర అనారోగ్య పరిస్థితులు తలెత్తితే, చికిత్స నిమిత్తం పాలసీ నుంచి ముందస్తుగా బయటకు రావడానికి అవకాశం కల్పిస్తోంది. కొనుగోలు చేసిన ధరలో 98 శాతం తిరిగి చెల్లిస్తుంది.