హైదరాబాద్ లో నగరంలో విషాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. ఒకరు మూడేళ్ల పాప కాగా, మరొకరు ఆరేళ్ల బాలుడు.
షాపు వద్ద అవరణలో ప్లేట్లను కడుగుతున్న ఆరేళ్ల బాలుడిని పోలీస్ పెట్రోలింగ్ వాహనం వెనక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. ఈ హృదయ విదారకర ఘటన మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధి సీతారాంబాగ్ చౌరస్తాలో బుధవారం జరిగింది. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. మంగళ్‌హాట్ గుఫానగర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్, రేణుక దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. శ్రీనివాస్ మెకానిక్‌గా పని చేస్తుండగా రెండో కుమారుడైన హర్షవర్ధన్ (6) బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తండ్రికి భోజనం తీసుకొని షాపు వద్దకు వచ్చాడు. అనంతరం వారు తిన్న ప్లేట్లను కడుగుతుండగా.. అటుగా వచ్చిన మంగళ్‌హాట్ పీఎస్ కు చెందిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. వాహనంలో గాలిని నింపించుకున్న అనంతరం డ్రైవర్ వాహనాన్ని వెనక్కి తీసే క్రమంలో అక్కడే ప్లేట్లు కడుగున్న హర్షవర్ధన్‌ను గమనించకుండా ఎక్కించాడు. ఇది గమనించిన శ్రీనివాస్, స్థానికులు కేకలు వేయడంతో భగవంత్‌రెడ్డి వాహనాన్ని నిలిపి వేశాడు. స్థానికుల సాయంతో టైర్ల కింద నలిగిపోయిన బాలుడిని ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పాతబస్తీలో మరో ఘటనః
పాతబస్తీ చాంద్రాయణగుట్టలో జరిగిన మరో ఘటనలో ఓ టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం మూడేళ్ల చిన్నారి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. చాంద్రాయణగుట్టలోని మిల్లాత్ కాలనీలో నివసించే మహ్మద్ నూర్, జకియాబేగం భార్యభర్తలు. వీరికి ముగ్గురు సంతానం. వీరిలో చిన్న కూతురు మారియం బేగం (3) బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఆడుకుంటూ గేట్ తీసుకొని బయటికి వచ్చింది. అదే సమయంలో బస్తీ గల్లీలోకి వచ్చిన టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ చిన్నారిని ఢీ కొట్టాడు. దీంతో పాప అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే టిప్పర్ డ్రైవర్, క్లీనర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాపను ఉస్మానియాకు తరలించారు. అప్పటికే చిన్నారి మరణించిందని డాక్టర్లు ధృవీకరించారు. అయితే ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ను పోలీసులు స్టేషన్ తరలించారు. ఈ ఘటనకు సంబంధి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు సమాచారం.