ఫిలిప్పీన్స్ కు చెందిన ఓ మహిళ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈమె ప్రయాణిస్తున్న విమానం నగరంలో ఎమర్జెన్సీ లాండింగ్ కాగానే.. పండంటి బిడ్డ పుట్టాడు. 37 వారాల గర్భవతి అయిన ఈమె.. దుబాయ్ నుంచి మనీలాకు ‘ సెబు పసిఫిక్ ‘ విమానంలో ప్రయాణిస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో అత్యవసరంగా ప్లేన్ ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో దింపారు. ఎయిర్ పోర్టు మెడికల్ సెంటర్ కు చెందిన అంబులెన్స్ లో ఈమెను తీసుకువెళ్తుండగా.. వాహనంలోనే కాన్పు జరిగింది. అయితే పురిటి నొప్పుల సమయంలో తీవ్రంగా బాధ పడిన ఆమెను జూబిలీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఆసుపత్రిలో తక్షణ చికిత్స లభించడంతో తల్లీ బిడ్డల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ విధమైన కేసులు తమ ఆసుపత్రికి నెలకు అయిదారు వస్తుంటాయని డాక్టర్లు తెలిపారు.