AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో నమోదైన కేసును అత్తాపూర్ పోలీసులు ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేయగా, తదుపరి దర్యాప్తును షీటీమ్స్ చేపట్టనున్నాయి. ఇదిలా ఉండగా, ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేయలేదని వైద్యుల నివేదిక స్పష్టం చేయడంతో కేసు దర్యాప్తు మరింత ఆసక్తికరంగా మారింది. పోలీసులు సూసైడ్ నోట్, వాంగ్మూలం తదితర అంశాలపై లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
Trainee Ips Uday Krishna Reddy Case
Shaik Madar Saheb
|

Updated on: Jul 22, 2026 | 11:21 AM

Share

మహిళా ట్రైనీ ఐపీఎస్ కంప్లైంట్.. ఆ వెంటనే ట్రైనీ ఐపీఎస్ సస్పెన్షన్‌.. ఆ తరువాత హాస్పిటల్‌లో అడ్మిషన్. ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో ఆద్యంతం హైడ్రామా నడిచింది. ఈ క్రమంలోనే నేషనల్ పోలీస్ అకాడమీ మహిళ ట్రైనీ IPSపై లైంగిక వేధింపుల కేసులో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఆయన ఆత్మహత్యాయత్నం చేయలేదని ప్రకటించారు. ఉదయ్ కృష్ణారెడ్డి ఆసుపత్రిలో ఉండగానే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్తాపూర్ లో నమోదైన కేసును అధికారులు ఉమెన్ సేఫ్టీ వింగ్‌కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారుల నిర్ణయంతో తదుపరి దర్యాప్తును షీటీమ్స్‌కు అప్పగించారు. షీటీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షణలో విచారణ చేయాలని నిర్ణయించారు. కాగా.. సస్పెండైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి ఇవాళ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ కానున్నారు. ఇప్పటికే.. ఉదయ్ పేరుతో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోలుకున్న తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయనున్నారు.

హైకోర్టులో పిటీషన్..

ఇదిలాఉంటే.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ ఉదయ్ కృష్ణా రెడ్డి పిటీషన్ వేశారు. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు మేరకు ఉదయ్ కృష్ణా రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ పిటీషన్ పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది.

పోలీసుల కేసు నమోదు తర్వాత..

అంతకుముందు.. తనను ఉదయ్ కృష్ణారెడ్డి లైంగికంగా వేధించారని.. మహిళా ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఉదయ్, మోతీనగర్‌లోని తన సోదరుడి ఇంట్లో అపస్మారక స్థితిలో పడిపోయారు. మంచం పక్కనే మద్యం సీసాలతో పాటు ఖాళీ శానిటైజర్ బాటిల్, రెండు పేజీల సూసైడ్ నోట్ లభించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆత్మహత్యాయత్నంగా భావించి ఎస్సార్‌నగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి తెచ్చిన వెంటనే అత్యవసర చికిత్స అందించిన వైద్యులు, ముందస్తు జాగ్రత్తగా స్టమక్ వాష్ చేసి రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపారు. బ్లడ్ టెస్టులు చేశారు. ఆ రక్త పరీక్షల్లో ఉదయ్ శరీరంలో ఎలాంటి పాయిజన్ ఉన్నట్లు తేలలేదు. ఆహారం తీసుకోకుండా, మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మాత్రమే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారని తేలింది.

తప్పు చేయలేదు.. సూసైడ్ అటెంప్ట్ చేయలేదు..

స్పృహలోకి వచ్చిన తరువాత అసలేం జరిగిందని అడిగితే.. తానేం సూసైడ్ అటెంప్ట్ చేయలేదని చాలా కూల్‌గా చెప్పారు ఉదయ్. ఆల్కహాల్ మత్తులోనే ఉన్నానని ఉదయ్ స్వయంగా చెప్పారు. మరి.. ఆ సూసైడ్ నోట్ సంగతేంటని ప్రశ్నిస్తే.. తీవ్ర ఒత్తిడిలో ఉండటం వల్లనో, మత్తులోనో సూసైడ్ నోట్ రాసుంటానేమో అని అంటూనే, అసలు ఆ నోట్ రాశానో లేదో కూడా గుర్తులేదంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. వైద్యుల నివేదిక చూశాక, ఉదయ్ కృష్ణారెడ్డి వెర్షన్ విన్నాక.. పోలీసులకు చాలా డౌట్స్ వచ్చాయ్. కేవలం సానుభూతి పొందేందుకే ఉదయ్ ఈ తరహా డ్రామా ఆడారా అని పోలీసులు అంచనా వేస్తున్నారు. అక్కడ దొరికిన సూసైడ్ నోట్ ఎప్పుడు రాశారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

బట్.. ఆ లేఖలో ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్‌తో ఏడాది కాలంగా పరస్పర అంగీకారంతోనే సంబంధం ఉందని, ఆమెకు పెళ్లైన తర్వాత కూడా కంటిన్యూ అయిందని రాసుకొచ్చారు. ఈ డిటైల్స్‌తో పాటు తమ ఇద్దరి వీడియాలు ఆమె భర్తకు పంపానని కూడా చెప్పుకొచ్చారు. తానేం తప్పు చేయకపోయినా.. కావాలనే తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కేసు పెట్టించారని ఆరోపించారు ఉదయ్. ఈ పరిణామాలే తన ఆత్మహత్యాయత్నానికి కారణమని సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us