తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. రేపటి నుంచి ఈనెల 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కోవిడ్ ప్రభావంతో సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. రేపటి నుంచి ఈనెల 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కోవిడ్ ప్రభావంతో సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
శ్రీ విశ్వక్సేనుల వారిని రంగనాయకుల మండలంలోకి వేంచేపు చేసి.. ఆస్థానం చేపట్టారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం అత్యంత కీలకమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్ధించేందుకు అంకురార్పణం చేస్తారు. వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల, ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులోభాగంగా బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం జరిపారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి వారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై ఊరేగుతారు. ఆదిశేషుడు తన శిరస్సుపై సమస్త భూభారాన్ని మోస్తుంటారు. ఆదిశేషుడు శ్రీవారికి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా శ్రీమన్నారాయణుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శేషుడిని దర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
ఇప్పటికే బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరస్వామి.. ప్రత్యేక పూజలను అందుకుంటున్నారు. స్వామివారితో సమానంగా మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజలు నిర్వహిస్తున్నారు. 15 కోట్ల సంవత్సరాల ముందు శ్రవణ నక్షత్రం కన్యామాసంలో శ్రీవారు తిరుమల కొండపై ఆవిర్భవిచారని పురాణ ప్రాశస్త్యం. అప్పుడే శ్రీవారి వక్షస్థలంపై వ్యూహలక్ష్మి అమ్మవారు, పద్మావతి అమ్మవారు కూడా కొలువయ్యారు. మూలమూర్తి వక్షస్థలంలో చతుర్భుజాకారంలో చిన్న పరిణామంలో వ్యూహలక్ష్మి ఉంటారు. ప్రతీ శుక్రవారం మూలమూర్తికి అభిషేకం చేస్తారు.
అక్టోబరు 24న ఉదయం 6 నుండి 9 గంటల వరకు ఆలయంలోని అద్దాల మండపంలో స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల మరుసటి రోజు అక్టోబరు 25న ఏకాంతంగా విజయదశమి పార్వేట ఉత్సవం జరుపుతారు. అదేరోజు మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపానికి శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేస్తారు. అక్కడ పార్వేట ఉత్సవం తర్వాత స్వామివారిని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేస్తారు.