బీహార్ ఎన్నికలకు 30 వేల మంది కేంద్ర బలగాలతో బందోబస్తు

|

Sep 28, 2020 | 2:34 PM

బీహార్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు కట్టదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.

బీహార్ ఎన్నికలకు 30 వేల మంది కేంద్ర బలగాలతో బందోబస్తు
Follow us on

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఒక్కనెల మాత్రమే గడువు ఉండడంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది అధికార యంత్రాంగం. మరోవైపు రాజకీయ పార్టీలు పొత్తులు, ఎత్తులతోపాటు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కరోనా సమయంలో తొలిసారి పోలింగ్ జరుగుతుండటంతో బీహార్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరోవైపు ఉద్రిక్తతలకు మారుపేరైన బీహార్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు కట్టదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల బందోబస్తు కోసం 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించేందుకు వీలుగా అదనపు బలగాలను పంపిస్తోంది.80 కంపెనీల సీఆర్ పీఎఫ్, 50 కంపెనీల సీఐఎస్ఎఫ్, 30 కంపెనీల ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు, 55 కంపెనీల బీఎస్ఎఫ్, 70 కంపెనీల సహస్ర సీమాబల్,. 15 కంపెనీల ఆర్పీఎఫ్ బలగాలను బీహార్ కు పంపించనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది.

బీహార్ లోని 38 జిల్లాల్లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు 30వేల మంది కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. బీహార్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలైన గయ, ఔరంగాబాద్ జాముయి, జెహ్నాబాద్, లఖీసరాయి జిల్లాలకు అదనపు బలగాలు మోహరించేందుకు కేంద్ర హోంశాఖ చర్యలు చేపడుతోంది. ఇక, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కేంద్ర బలగాల ప్రత్యేక కూంబింగ్ ముమ్మరం చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.