Anandayya : ఆనందయ్య కరోనా మందుతో ప్రాణాలు నిలబడ్డాయని చెప్పిన రిటైర్డ్ మాస్టారు ఆరోగ్య పరిస్థితి మళ్లీ మొదటికి.!
Krishnapatnam Anandayya covid medicine : నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుతో ప్రాణాలు నిలబడ్డాయని చెప్పిన ఒక రిటైర్డ్ మాస్టారు ఆరోగ్య పరిస్థితి మళ్లీ..
Krishnapatnam Anandayya covid medicine : నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుతో ప్రాణాలు నిలబడ్డాయని చెప్పిన రిటైర్డ్ మాస్టారు ఆరోగ్య పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఆనందయ్య ఇచ్చిన పసరు మందు తీసుకున్న మాస్టారు కోటయ్యకు కంటి సమస్య తలెత్తింది. టాక్సిక్ కెరాటిటిస్ (Toxic keratitis) అనే డీసీజ్ మొదలైందని వైద్యులు గుర్తించినట్టు సమాచారం. పసరు వేయడం వల్ల కంటి నల్ల గుడ్డు పైపొర దెబ్బ తింటుందని.. జిల్లేడు పాల వల్ల ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుందని కంటి వైద్యులు చెబుతున్నారు. ఇలా ఉండగా, నిన్న సదరు మాస్టారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. అయితే, ఇప్పుడు అదే మాస్టారు అనారోగ్యం గురించి చెప్పిన మరో వీడియో మళ్లీ నెట్టింట్లో హల్ చల్ చేస్తుండటం విశేషం.
ఇలాఉండగా, ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద కరోనా ముందుకు మరోసారి బ్రేక్ పడింది. అర్ధరాత్రి ఆనందయ్య ఇంటికి , మందు పంపిణీ కేంద్రానికి పోలీసులు చేరుకున్నారు. మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి.. మ౦దు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ్టి నుంచి ప్రభుత్వం అనుమతి వచ్చే వరకు మందు పంపిణీ లేదని ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు. మందు కోసం ఎవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆనందయ్యకు పోలీసులు అదనపు భద్రత కల్పించారు. కాగా, ఆనందయ్య మందుపై కృష్ణపట్నంలో ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతుండగా, ఇవాళ ఐసీఎంఆర్ టీమ్ తో కలిసి మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ఒక ఐసీఎంఆర్ బృందం నిన్ననే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చేరుకుంది. ఈ సందర్భంగా కరోనా ఆయుర్వేద మందుగా ఆనందయ్య తయారుచేసే వివిధ చెట్ల ఆకులు, పదార్థాలను పరిశీలించారు. తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయుర్వేద మందు లో ఏమేమి వస్తువులు కలుపుతున్నారు ఎలా తయారు చేస్తున్నారు అనే విషయాలను దగ్గరుండి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయుర్వేద మందు వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా అనే విషయాన్ని ఐసీఎంఆర్ బృందం ప్రధానంగా దృష్టి సారించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి తదితరులు కూడా ఐసీఎంఆర్ బృందంతో ఉన్నారు.