ఏపీలో వరదల ధాటికి 10 మంది మృతి.. మృతులందరికీ ఎక్స్‌గ్రేషియా..!
ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు విలవిలలాడాయి.
ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు విలవిలలాడాయి. ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని ప్రాంతాల్లో రహదారులు తెగిపోయాయి. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి 6.46 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో కృష్ణా నదికి కుడి, ఎడమ ప్రాంతాల్లోని ఆవాస ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్‌లు, ఇతర అధికారులు, పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. కాగా, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటివరకు 10 మంది మృతిచెందినట్లు ఏపీ సీఎం కార్యాలయం వెల్లడించింది. మృతులందరికీ ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారని ఏపీ సీఎంవో తెలిపింది.
భారీ వర్షాలు, వరదలపై క్యాంప్ కార్యాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలతో సీఎం శ్రీ వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్. pic.twitter.com/EQzJRwx9OX
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 14, 2020