అటు మండే ఎండలు.. ఇటు అకాల వర్షాలు.. తెలంగాణలో బీభత్సం..
తెలంగాణ రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్లడం లేదు గానీ.. ఎండలు మండిపోతున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ సారి భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. లాక్‌డౌన్ పుణ్యమా అని ఇంట్లోనే ఉంటూ ఏసీలు

తెలంగాణ రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్లడం లేదు గానీ.. ఎండలు మండిపోతున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ సారి భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. లాక్‌డౌన్ పుణ్యమా అని ఇంట్లోనే ఉంటూ ఏసీలు, కూలర్ల ముందు కూర్చుంటున్నాం గానీ.. బయట ఎండ, ఉక్కపోత నరకం చూపిస్తున్నాయి. రైతులు, చిరు వ్యాపారులు.. ఎండల ధాటికి తట్టుకోలేకపోతున్నారు. పూరి గుడిసెల్లో ఉండేవారు, ఇటుక బట్టీల వద్ద పనిచేసేవారు అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది.
కాగా.. ఈ వేసవికాలంలో అకాల వర్షాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు పడటంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. కాగా, నేడు, రేపు కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి ఆగ్నేయ మధ్యప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.