Telangana: తెలంగాణ పోలీస్ శాఖలో భారీ మార్పులు.. మూడు కమిషనరేట్ల పరిధిలో కొత్త జోన్లు ఇవే..
తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు జరిగాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు కమిషనరేట్లను 12 జోన్లుగా పునర్విభజించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధి విస్తరించగా, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలోనూ కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అసలు ఏమేమి మార్పులు జరిగాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో మూడు కమిషనరేట్‌లలో మార్పులు చేశారు. మొత్తం మూడు కమీషనరేట్‌లను 12 జోన్లుగా విభజించారు. అందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆరు జోన్లు, రాచకొండ పరిధిలో మూడు జోన్లు, సైబరాబాద్ పరిధిలో మూడు జోన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న శంషాబాద్ రాజేంద్రనగర్ జోన్లు ఇకపై హైదరాబాద్ కమిషనరేట్‌లో భాగం కానుంది. ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న యాదాద్రి జిల్లాలో పోలీస్ జిల్లా ఎస్పీగా మార్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నా.రు షాద్‌నగర్ చేవెళ్ల మహేశ్వరం జోన్‌ను కలుపుతూ నూతన కమిషనరేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ కమిషనరేట్‌లో..
పోలీస్ కమిషనరేట్ల మార్పులో భాగంగా శంషాబాద్ జోన్ కొత్తగా హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో కలిపారు. దీంతోపాటు రాజేంద్రనగర్ జోన్ కూడా ఈ కమిషనరేట్లో కలిపారు. దీంతో గోల్కొండ జోన్, చార్మినార్ జోన్ ఖైరతాబాద్ జోన్, రాజేంద్రనగర్ జోన్, సికింద్రాబాద్ జోన్, శంషాబాద్ జోన్లు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న ప్రధాన నాలుగు జో తో కలిపి మరో రెండు జోన్లు పెరగడంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధి మరింత పెరగనుంది.
సైబరాబాద్ కమిషనరేట్‌లో..
మరోవైపు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో కూడా భారీగా మార్పులు జరిగాయి. ఈ కమిషనరేట్ పరిధిలో శేర్లింగంపల్లి కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఉండగా మొయినాబాద్ నుంచి పటాన్‌చెరు వరకు షేర్ లింగంపల్లి జోన్‌లో కలిపారు. మాదాపూర్‌లో కూకట్‌పల్లి జోన్లో కలిపారు. కుత్బుల్లాపూర్ యధాతధంగా ఉంది.
రాచకొండ కమిషనరేట్..
ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్ మల్కాజ్‌గిరి ఉప్పల్ జోన్‌లు ఉన్నాయి. ఇంతకుముందు ఈ కమిషనరేట్ పరిధిలో ఉన్న యాదాద్రి జిల్లా ప్రాంతాలను యాదాద్రి జిల్లా ఎస్పీ పరిధిలోకి మార్చారు. మరోవైపు మహేశ్వరం జోన్ షాద్ నగర్ చేవెళ్ల జోన్లను కలుపుతూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌గా ఏర్పాటు చేసినందుకు కసరత్తు జరుగుతుంది.
