ఏపీలో ప్రతీ వ్యక్తికి రూ. 20వేల అప్పు
ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ వ్యక్తి తలపై 20 వేల రూపాయల అప్పు ఉందని టీడీపీ సీనియర్ నేత పట్టాభిరామ్ చెప్పారు. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో ఏపీలో ప్రతి కుటుంబానికి 80 వేల రూపాయల అప్పులు మిగిలాయని..

ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ వ్యక్తి తలపై 20 వేల రూపాయల అప్పు ఉందని టీడీపీ సీనియర్ నేత పట్టాభిరామ్ చెప్పారు. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో ఏపీలో ప్రతి కుటుంబానికి 80 వేల రూపాయల అప్పులు మిగిలాయని విమర్శించారు. ప్రతి గంటకు 9 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ జగన్ ప్రభుత్వం ఇష్టానుసారం రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోందని ఆరోపించారు. తనకంటే గొప్ప ఆర్థికమంత్రి లేడని చెప్పుకునే బుగ్గన దీనికేం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఏడాదికి రూ. 25,654 కోట్ల చొప్పున రూ.1 లక్ష 28 వేల కోట్లు అప్పు చేస్తే.. జగన్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికే రూ.49 వేల 200 కోట్లు అప్పు చేసిందని తెలిపారు.
జగన్ సర్కారు గడచిన మూడు నెలల్లోనే రూ.33 వేల 300 కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. కేవలం 15 నెలల వ్యవధిలో ఏపీ ప్రభుత్వం రూ.97,118 కోట్లు అప్పులు చేసినట్టు కాగ్ స్పష్టంగా చెప్పిందని పట్టాభిరామ్ వెల్లడించారు. చంద్రబాబు పాలనలో అప్పులను సక్రమంగా అభివృద్ధి, సంక్షేమాలకే ఖర్చు చేస్తే.. జగన్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి ప్రజలపై మోయలేని భారం వేస్తున్నారని పట్టాభి ఎద్దేవా చేశారు.