ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృధ్వీరాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా తాను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యానని, కుట్రపూరితంగా తనను ఎస్వీబీసీ నుంచి తప్పించారని నిరసన వ్యక్తం చేశారు. తనను ఎస్వీబీసీ నుంచి తప్పించి కొందరు పైశాచిక ఆనందం పొందారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చినందుకే తనపై కుట్ర పన్నారన్నారు. తన చుట్టూ ఉండే వారే వెన్నుపోటు పొడిచారని పృథ్వీ తెలిపారు. సజ్జల, వైవీ, విజయసాయిరెడ్డిలకు మాత్రమే తాను జవాబుదారిగా ఉంటానన్నారు.
మరోవైపు, అమరావతి రైతులను కించపరిచేలా తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదన్నారు. తాను ఏ సామాజిక వర్గాన్నీ టార్గెట్ చేయలేదని… అది దుష్ప్రచారం మాత్రమేనని పేర్కొన్నారు. ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలో కొనసాగుతానని ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీ స్పష్టం చేశారు.