AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Music Rocks: రాళ్లలో దాగున్న రాగాలు.. తాకితే స్వప్తస్వరాలు పలికే ఆ రాళ్లు ఎక్కడ… రాగాల కొండ రహస్యంపై పరిశోధనలు

వడగండ్ల వాన పడ్డ సమయంలో ఈ రాగాల కొండ పరిసరాలన్నీ వింతైన ధ్వని తరంగాలతో అబ్బుర పరుస్తాయి. ఆ ఫీలింగ్ మాటల్లో చెపితే అర్థంకాదు ప్రత్యక్షంగా అనుభవించాల్సిందే.. ఈ మ్యూజికల్ రాక్స్ ను స్థానికులు ఓ మహత్యంగా భావిస్తున్నారు. మనసు బాగలేకపోతే ఇక్కడికి వచ్చి బండరాళ్లు రాపిడిచేస్తే ఈ రాళ్లు పలికేరాగాలు రోగాలను కూడా నయం చేస్తాయని స్థానికులు చెబుతున్నారు..

Music Rocks: రాళ్లలో దాగున్న రాగాలు.. తాకితే స్వప్తస్వరాలు పలికే ఆ రాళ్లు ఎక్కడ... రాగాల కొండ రహస్యంపై పరిశోధనలు
Singing Stones
G Peddeesh Kumar
| Edited By: Surya Kala|

Updated on: Sep 08, 2023 | 12:57 PM

Share

అక్కడ రాళ్లు రాగాలు పలుకుతాయి.. స్పర్శ తాకితే స్పందిస్తాయి. ఆ రాళ్లు పలికే సరిగమపదనిసలు మనసును పులకరింప చేస్తాయి. ఆ రాగల కొండ పై ఒక్కో శిల ఒక్కో విచిత్రం.. రాళ్లు రాగాలు పాలకడమేంటి.? జీవంలేని శిలలు ఎలా సప్తస్వరాలు పలుకుతాయి..? వింటుంటే విచిత్రంగా ఉంది కదూ..? ఆ రాగాల కొండ రహస్యం ఔరా అనిపిస్తుంది. బాహ్య ప్రపంచానికి తెలియని ఆ అద్భుతం ఈ సింగింగ్ రాక్స్.. చెవులను  మైమరిపిస్తున్న ఈ అద్భుతం.. కర్ణాలు మై మరపించేలా పరిమళించి పోయేలా చేస్తాయి. తన్మయత్వంతో ప్రతి మనసు పులకరించిపోయేలా చేస్తుంది.

చూపుకు శిలలే.. ప్రాణంలేని రాళ్లే.. కానీ ఈ శిలలన్నీ ఓ విచిత్రం.. ఓ అద్భుతం.. ఏ శిలను రాపిడి చేసినా రాగాలు హోయలొలుకుతాయి. ఈ బండరాయిని తాకిన ప్రతీ ఒక్కరూ సంగీత కళాకారుడిలా మురిసి పోవాల్సిందే. ఇప్పటివరకు ఎవరూ గుర్తించని ఈ మిరాకిల్ రాక్స్ ప్రత్యేకతను కనులారా చూసి చెవులారా వింటేనే ఆ అద్బుతం గురించి అర్థమవుతుంది. వీటిని సింగింగ్ రాక్స్, మ్యూజికల్ రాక్స్ అంటుంటారు.. మైనింగ్ మాఫియా వలలో చిక్కుకున్న ఈ రాగాల కొండను బాధ్యతగా బాహ్య ప్రపంచానికి తెలిపి, కాపాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏర్పడింది..

జనగామ & సిద్దిపేట జిల్లాల సరిహద్దులో సుమారు 90 కిలో మీటర్ల నిడివితో డోలరైట్ శిలలు ఉన్నాయి.. ముఖ్యంగా బచ్చన్నపేట మండలంలో ఎక్కువ శాతం ఈ గుట్ట ఎవరో పేర్చినట్లు కనిపిస్తాయి.. కట్కూరు, వీ.ఎస్.ఆర్ నగర్ సమీపంలో ఎక్కువగా ఈ శిలలు కనిపిస్తాయి.. వీటిని తాకితే స్పందిస్తాయి.. ఒక్కో రాయి ఒక్కో రాగం పలుకుతుంది.. ఒక్కోచోట ఒక్కో రకమైన ధ్వని తరంగాలు మనసు పులకరింప చేస్తాయి. ఈ రాళ్లను రాపిడిచేస్తే చక్కటి వినసొంపైన ధ్వని తరంగాలు సవ్వడి చేస్తాయి.. ఓ రాయి గుళ్లో గంట కొట్టినట్లు టంగ్.. టంగ్ మని ప్రతిధ్వనిస్తే మరో రాయి ఇనుప రాడ్డుతో గంట కొట్టినట్లు ధ్వనిస్తుంది..

ఇవి కూడా చదవండి

వడగండ్ల వాన పడ్డ సమయంలో ఈ రాగాల కొండ పరిసరాలన్నీ వింతైన ధ్వని తరంగాలతో అబ్బుర పరుస్తాయి. ఆ ఫీలింగ్ మాటల్లో చెపితే అర్థంకాదు ప్రత్యక్షంగా అనుభవించాల్సిందే.. ఈ మ్యూజికల్ రాక్స్ ను స్థానికులు ఓ మహత్యంగా భావిస్తున్నారు. మనసు బాగలేకపోతే ఇక్కడికి వచ్చి బండరాళ్లు రాపిడిచేస్తే ఈ రాళ్లు పలికేరాగాలు రోగాలను కూడా నయం చేస్తాయని స్థానికులు చెబుతున్నారు..

ఈ వింతైన రాగాల కొండ రహస్యాన్ని బాహ్య ప్రపంచానికి తెలియకుండా చేసిన మైనింగ్ వ్యాపారులు గుట్టు చప్పుడు కాకుండా గుట్టను మాయం చేస్తున్నారు.. ఈ అద్భుతాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన రత్నాకర్ రెడ్డి అనే చరిత్ర పరిశోధకుడు ఈ రాతి కొండ రహస్యాన్ని ఛేదించిందేందుకు పరిశోధనలు చేస్తున్నారు.

వీటిని డైక్స్, అగ్ని శిలలు, డోలరైట్ శిలలని అంటారు. జనగామ జిల్లా కేంద్రానికి తూర్పు దిక్కున సుమారు 90 కిలోమీటర్ల నిడివితో ఎవరో పేర్చినట్లు విస్తరించి ఉన్నాయి.. వీటిలో ఒక్కో రాయి నుండి ఒక్కో రకమైన శబ్దం వినిపిస్తుంది.. ఈ డైక్స్ ఎలా ఏర్పడతాయి.. ఎన్ని వేల సంవత్సరాలు క్రితం ఇక్కడ ఈ శిలలు ఏర్పడ్డాయి.. సాదారణ రాళ్ళకు ఈ రాళ్లకు మధ్య వ్యత్యాసం ఏంటి..? అసలు శిలలు ఇలా ప్రతిధ్వనించడమేంటనే విషయాలపై అధ్యయనం మొదలు జరుగుతుంది.. వీటిని శాస్త్రీయంగా మాగ్మాటిక్ డైక్స్, అవక్షేపాల శిలాద్రవం అంటారు.. బలహీనంగా ఉన్న భూమి పొరల్లో నుండి ఉబికివచ్చి చల్లబడినప్పుడు ఇలాంటి మాగ్మాటిక్ డైక్స్ ఏర్పడతాయి.. ఇవి ఆర్కియాన్ కాలానికి చెందిన డైక్స్ గా భావిస్తున్నారు.. ఇవి ఏర్పడి లక్షల సంవత్సరాలు గడిచి వుంటుందని అంటున్నారు..

ఈ అద్భుతాన్ని చూడాలన్నా.. రాళ్ళ సవ్వడి వినాలన్నా వరంగల్ జిల్లా కేంద్రం నుండి 90 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే.. గుట్ట పైకి వెళ్లాలంటే కొంచెం రిస్క్.. కానీ ఈ గుట్టపైకి చేరగానే రాగంతో సగం రోగాలు రాలిపోతాయనేది నమ్మకం.. ఇంతగొప్ప విశిష్టత కలిగిన రాగాల కొండ ఇప్పుడు ఆపదలో చిక్కుకుంది.. మైనింగ్ మాఫియా ఈ రాగాల కొండను మాయంచేసి సింగింగ్ రాక్స్ కనుమరుగై పోయేలా చేస్తున్నారు.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ మ్యూజికల్ రాక్స్ ను సజీవంగా కాపాడుతుందని ఆశిద్దాం…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..