కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుని ఎన్నికపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిజానికి పార్టీకి నూతన ప్రెసిడెంటును ఎన్నుకునేందుకా అన్నట్టు పార్టీ వర్కింగ్ కమిటీ శనివారం సమావేశమైంది. సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ ని ఈ పదవికి ఎన్నుకోవచ్ఛునని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికను ప్రస్తుతానికి చేపట్టరాదని ఈ సమావేశంలో నిర్ణయించారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు హాజరైన ఈ మీటింగ్..నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే బదులు జోనల్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సిఎల్ఫీనేతలని అయిదు గ్రూపులుగా విభజించి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని తీర్మానించారు. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాల నేతలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఉత్తరాది రాష్ట్రాల వారితో ప్రియాంక గాంధీ, పశ్చిమ రాష్ట్రాల వారితో రాహుల్ గాంధీ, తూర్పు రాష్ట్రాల వారితో సోనియా, ఈశాన్య రాష్ట్రాల వారితో అంబికా సోని సంప్రదింపులు జరుపుతారు. కేవలం వర్కింగ్ కమిటీ నాయకులతోనే కాకుండా ఆయా రాష్ట్రాల నేతలతోనూ చర్చలు జరిపి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్న రాహుల్ సూచన మేరకు ఈ జోనల్ కమిటీలను ఏర్పాటు చేయడం విశేషం. దీంతో నూతన బాస్ ని ఎన్నుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్ఛునని భావిస్తున్నారు.
అటు-కొత్త ప్రెసిడెంట్ ఎన్నికలో తాము భాగస్వామ్యం వహించే ప్రసక్తి లేదని సోనియా, రాహుల్ స్పష్టం చేశారు. వారు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఫలితంగా ఇక ఈ బాధ్యత పార్టీ ప్రెసిడెంట్లు, ఇతర ముఖ్య నేతలపై పడింది.కీలకమైన సోనియా, రాహుల్ వంటివారు అంటీముట్టనట్టు ఇలా అతి ముఖ్యమైన సమావేశం నుంచి బయటకి వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇన్నేళ్ల చరిత్ర గల పార్టీ కేవలం కొత్త అధ్యక్షుని ఎన్నిక మీద ఇప్పటికీ ఇలా మల్లగుల్లాలు పడడం అంతు చిక్కడంలేదు. అటు- అధ్యక్షుని ఎన్నిక కోసం నామినేషన్ పధ్దతిని ప్రవేశపెట్టాలా అని కూడా పార్టీ యోచిస్తున్నట్టు సమాచారం.