
భారత్, చైనా దేశాల మధ్య బోర్డర్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ప్రధాని అన్ని పార్టీల చీఫ్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. ఇందులో అన్ని పార్టీలూ కూడా చైనా తీరును తీవ్రంగా ఖండించాయి. అటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
”క్లిష్టమైన సంక్షోభ సమయంలో దేశ ప్రజలకు ఎటువంటి సమాచారం లేదు. అసలు చైనా బలగాలు లదాఖ్‌లోకి ఎప్పుడు ప్రవేశించాయి. మే 5 నుంచి జూన్ 6 వరకు ఉన్న విలువైన సమయాన్ని వృధా చేశాం. కోర్ కమాండర్ స్థాయి చర్చల అనంతరం రాజకీయ, దౌత్య చర్చలు జరపాల్సింది. కానీ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం కావడం వల్లే 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయాలపాలయ్యారు. ఇప్పటికైనా మొదటి నుంచి అసలు ఏం జరిగిందో ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సవివరంగా చెప్పాలి” అని సోనియా గాంధీ ఆల్ పార్టీ మీటింగ్‌లో పేర్కొన్నారు. అటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ.. సైనికులు సాయుధులై ఉండాలా.? వద్దా.? అన్నది అంతర్జాతీయ ఒప్పందాలే నిర్ణయిస్తాయని అన్నారు. ఇక ఇలాంటి సున్నితమైన అంశాలను అందరూ గౌరవించాలన్నారు.