AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భక్తితో పూజించండి.. కానీ ప్రకృతిని పాడుచేయకండి..

పదకొండు రోజులపాటు మండపాల్లో కొలువుదీరిన గణనాథులు నిమజ్జనమయ్యారు. ఎంతో అట్టహాసంగా డోలు బాజాలు మోగించుకుంటూ ఊరేగింపుగా సాగి చిట్టిపొట్టి గణేశ్‌లు మొదలు పదుల సంఖ్యలో ఎత్తయిన గణనాథులంతా గంగను చేరుకున్నారు. వాడవాడల్లో పదకొండు రోజులపాటు సాగిన సందడి ఒక్కసారిగా మూగబోయింది. చిన్న చిన్న వీధులు మొదలు పెద్ద పెద్ద సెంటర్లలో కళాత్మకంగా తీర్చిదిద్దబడిన బొజ్జగణపయ్యలు సాగుతున్న నిమజ్జనానికి తరలి వెళ్తున్న దృశ్యాల్ని ప్రత్యక్షంగా చూసినవారితో పాటు ఇంట్లో టీవీల ముందు కూర్చుని చూసిన వారు సైతం ఎంతో […]

భక్తితో పూజించండి.. కానీ ప్రకృతిని పాడుచేయకండి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 13, 2019 | 8:02 PM

Share

పదకొండు రోజులపాటు మండపాల్లో కొలువుదీరిన గణనాథులు నిమజ్జనమయ్యారు. ఎంతో అట్టహాసంగా డోలు బాజాలు మోగించుకుంటూ ఊరేగింపుగా సాగి చిట్టిపొట్టి గణేశ్‌లు మొదలు పదుల సంఖ్యలో ఎత్తయిన గణనాథులంతా గంగను చేరుకున్నారు. వాడవాడల్లో పదకొండు రోజులపాటు సాగిన సందడి ఒక్కసారిగా మూగబోయింది. చిన్న చిన్న వీధులు మొదలు పెద్ద పెద్ద సెంటర్లలో కళాత్మకంగా తీర్చిదిద్దబడిన బొజ్జగణపయ్యలు సాగుతున్న నిమజ్జనానికి తరలి వెళ్తున్న దృశ్యాల్ని ప్రత్యక్షంగా చూసినవారితో పాటు ఇంట్లో టీవీల ముందు కూర్చుని చూసిన వారు సైతం ఎంతో ముచ్చటపడ్డారు. రంగురంగుల గణపయ్యలు, రకరకాల ఆకారాల్లో దర్శనమిస్తూ కనివిందు చేస్తుంటే ఆబాలగోపాలం నయనానందకరంగా భక్తితో కూడిన తన్మయత్వానికి లోనయ్యారు. చూసీ చూడంగానే జై బోలో గణేశ్ మహరాజ్‌కీ అంటూ ఆనందంతొ నినాదాలు చేశారు.

ముగిసిన నిమజ్జనం

వినాయక చవితి మహోత్సవం ముగిసింది. నిమజ్జనం కూడా పూర్తయింది. ఇప్పుడు ఆయా చెరువులు, కుంటల్ని శుభ్రం చేయడం మిగిలింది. మనకు దేవుడంటే భక్తి, కానీ ప్రకృతి అంటే మాత్రం చులకన. ఔనన్నా కాదన్నా ఇది నిజమనిపిస్తుంది. మనం ఆపాదమస్తకం భక్తి భావంతో పూజించిన గణపయ్యను, ఎన్నో వ్యయ ప్రయాసకోర్చి నిలబెట్టుకున్న గణనాథులను నిమజ్జనానికి తరలించే సమయంలో ఒక్కటే అనుకుంటాం. ఈ గణేశ్‌లు ఎంత బాగున్నారో కదా అని, ఎన్నో వెరైటీల్లో గణేశ్ విగ్రహాలు రంగు రంగల్లో కనివిందు చేయడానికి చూసి ఆనందంతో కేరింతలు వేస్తాం. భక్తితో నమస్కరిస్తారు. కానీ ఒక్కసారి ఈ విగ్రహాలు రూపుదిద్దుకున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి ఆలోచించడం మర్చిపోతారు.

ఎంత ప్రమాదమో తెలుసా?

మీరు తెలుసా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పర్యావరణానికి ఎంత హాని కలుగుతుందో.? ఇప్పటికే మన పర్యవరణం ప్రమాదకరస్ధాయికి చేరిందని ఎంతోమంది పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేవలం మన సంతోషం కోసం సరదా కోసం పక్క వీధిలో నిలిపిన విగ్రహం కంటే పెద్దది, బాగా కనిపించేది, అంతకంటే మంచి వెరైటీగా ఉండేదాన్ని ప్రతిష్టిస్తున్నాం అంటూ పోటీపడతారే తప్ప ఈ ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారిస్ విగ్రహాల నిమజ్జనం తర్వాత ఆయా చెరువులు, కుంటలు ఎంతగా ప్రకృతికి విఘాతం కల్గిస్తాయో అనేది మాత్రం ఆలోచించరు.

విద్యాధికులే ఎక్కువ

చదువుకున్నవారు, పర్యావరణంపై అవగాహన ఉన్నవారు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో వ్యవహరించడం బాధాకరం. ఇప్పటికే హైదరాబాద్‌తో సహా పలు చోట్ల నిలిపిన ఎత్తయిన విగ్రహాలు నీటిలో కరిగి దాని నుంచి వెలువడే వ్యర్ధాలతో ఆయాచెరువులు పూర్తిగా కలుషితం కావడం ఎంతో దారుణం. ఆ నీటిలో ఆవాసాన్ని ఏర్పరచుకున్న చేపలు, చిన్న చిన్న జీవులు, ఆ చెరువు నీటిని తాగేందుకు దిగివచ్చే పక్షులు.. ఇలా ఆ నీటితో ప్రత్యక్షంగా సంబంధమున్న జీవుల మనుగడ ప్రశ్నార్ధకరంగా మారుతుందని గ్రహించరు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రతిష్టించిన విగ్రహాలు దాదాపు 58వేలు. వీటిలో ప్లాస్టర్ పారిస్ విగ్రహాల సంఖ్య అధికంగా ఉంది. హైదరాబాద్ నగంలో ఎంతో అట్టహాసంగా సాగిన నిమజ్జనం తర్వాత ఆయా చెరువుల్లో చెత్తను వెలికి తీయడం పెద్ద పని. అధికారులు అంచనా వేస్తున్న దానిప్రకారం గత ఏడాది కంటే ఈఏడాది విగ్రహాలకంటే వ్యర్ధాలు బాగా పెరిగినట్టుగా చెబుతున్నారు. నిమజ్జనం చేసిన విగ్ర హాలతో పాటు పూజలో వినియోగించిన సామగ్రిని కూడా చెరువులోనే వేశారు భక్తులు . దీనిని తీయడానికి ప్రత్యేకించి క్రేన్‌లు, లారీలు, సిబ్బంది కూడా చెత్త తొలగింపులో నిమగ్నమయ్యారు.

ఈ విగ్రహాలతో ఎన్నో అనారోగ్య సమస్యలు

శ్వాసకోస సంబంధ సమస్యలు,రక్తానికి సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులతో పాటు అనేక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పర్యావరణాన్ని నాశనం చేయడంతో పాటు నిమజ్జనం తర్వాత ఆ నీటిని పూర్తిగా కలుషితం చేస్తాయి.

పర్యావరణంపై ప్రేమతో మొక్కలు నాటుతున్న ప్రభుత్వాలు, ఆ మొక్కల్ని తిన్నాయని మేకల్ని అరెస్టు చేసిన పోలీసులు మనకు ఉండటం ఎంతో హర్షించదగ్గ విషయం. కానీ అంతకంటే ఎక్కువగా పర్యావరణానికి దారుణంగా తూట్లు పొడుతున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిషేదించడంలో ప్రభుత్వాలు అలసత్వం వహించడం విమర్శలకు తావిస్తోంది. ప్రజల్లో ఈ పీఓపీ విగ్రహాల వల్ల కలిగే నష్టాలపై చైతన్యం కలిగించలేకపోవడం పై పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తిపేరుతో పర్యావరణానికి విఘాతం కలిగించడం మార్కెట్ మాయాజాలమే అంటూ పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ప్రక‌ృతిని నాశనం చేసే ప్లాస్టిక్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, థర్మాకోల్ వంటి వాటిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతయినా ఉంది.