వేల కోట్లు సంపాదన.. అయినా వెంటాడే వెలితి!
జీవితంలో కావాల్సినంత సంపాదించి, నచ్చినట్టుగా జీవించాలని అందరూ అనుకుంటారు. ఆ లక్ష్యాన్ని కొందరు త్వరగా చేరుకుంటారు. మరికొందరు సాధించుకునే ప్రయత్నంలో ఉంటారు. కానీ ఓ యువ వ్యాపారవేత్తకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. చిన్న వయసులోనే వేల కోట్ల రూపాయలు సంపాదించేశాడు. ఇప్పుడింక ఏం చేయాలో తెలియట్లేదని అంటున్నాడు. భారత సంతతికి చెందిన వినయ్ హిరేమత్ టెక్ సంస్థ లూమ్‌ను స్థాపించి విజయం సాధించారు. దానిని గత ఏడాది అట్లాసియన్ సంస్థకు అమ్మేశారు. ఆ విక్రయం ద్వారా వినయ్‌కు 975 మిలియన్ డాలర్ల సొమ్ము అందింది.
అంటే మన కరెన్సీలో 8 వేల కోట్ల రూపాయలు. అంత సంపాదించిన వినయ్ వయసు 35 ఏళ్ల లోపే. అలాంటి వ్యక్తి కొత్త టెక్నాలజీ గురించి ఆలోచించుకుంటూనో, కుటుంబంతో సరదాగా గడుపుతూనో ఉంటారేమో అనుకుంటాం. కానీ రెండు రోజుల క్రితం ఆయన పెట్టిన పోస్టు మాత్రం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘‘నేను ధనవంతుడినయ్యా.. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. కావాల్సినంత ఆర్థిక స్వేచ్ఛ ఉన్నా ఓ సందిగ్ధంలో ఉన్నాను. జీవితంపై అంత సానుకూలంగా ఏమీ లేను. ఎవరి సానుభూతి పొందడానికో నేను ఈ పోస్టు పెట్టడం లేదు. అసలు ఏ ఉద్దేశంతో ఈ సందేశం రాస్తున్నానో కూడా నాకు తెలియదు’’ అంటూ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. గత ఏడాది కంపెనీని అమ్మిన తర్వాత వినయ్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ప్రయాణాలు చేయడం మొదలుపెట్టారట. ఎన్నో ప్రాంతాలు తిరిగేశారు. కానీ తనకున్న అభద్రతాభావం వల్ల ఆమెతో విడిపోయానని అన్నారు. ‘‘ఆమె ఈ పోస్టు చదువుతున్నట్టయితే.. ఈసందర్భంగా సారీ చెప్పాలనుకుంటున్నాను. నీకు కావాల్సినవిధంగా నేను ఉండలేకపోయాను. నీవు అందించిన అనుభూతులకు కృతజ్ఞతలు’’ అని తెలిపారు.