కామెంటేటర్‌గా తిరిగి తీసుకోండి: మంజ్రేకర్
ఐపీఎల్ ద్వారా బీసీసీఐ కామెంటరీ ప్యానల్‌లో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్. ఈ మేరకు తన ప్రయత్నాలను కూడా మొదలుపెట్టాడు.
Sanjay Manjrekar Letter: కరోనా విరామం తర్వాత క్రికెట్ సందడి షురూ అయింది. ఒక్కొక్కటిగా అంతర్జాతీయ టోర్నమెంట్లు, టోర్నీలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ముగియగా.. వన్డే సూపర్ లీగ్ నిన్నటి నుంచి ఆరంభమైంది. ఇక అందరూ ఎదురు చూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు జరగనుంది. దీనిపై బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇదిలా ఉంటే మళ్లీ ఐపీఎల్ ద్వారా బీసీసీఐ కామెంటరీ ప్యానల్‌లో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్. ఈ మేరకు తన ప్రయత్నాలను కూడా మొదలుపెట్టాడు. గతంలో ఓ వివాదం కారణంగా మంజ్రేకర్ బీసీసీఐ ప్యానల్ నుంచి తొలగింపబడ్డాడు. అయితే త్వరలో ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో.. మళ్లీ తనను ప్యానల్‌లోకి తీసుకోవాలంటూ బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు ఓ లేఖ రాశాడు. ” మీ గైడ్ లైన్స్ ప్రకారమే పని చేస్తానని.. గతంలో జరిగిన వివాదంపై వివరణ ఇచ్చానంటూ అభ్యర్ధపూర్వకంగా లేఖలో పేర్కొన్నాడు”. అయితే ఈ లేఖపై ఇప్పటివరకు బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.