దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 10,667 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 5 రోజులతో పోల్చుకుంటే దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,091కి చేరింది. 1,53,178 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,80,013 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన 4 గంటల్లో 380 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 9,900కి చేరింది. అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుల్లోనే నమోదు అయ్యాయి.
ముఖ్యంగా తమిళనాడులోని వైరస్ వ్యాప్తి ఉధృతి కొనసాగుతుండటంతో చెన్నై సహా నాలుగు జిల్లాల్లో ఈనెల 19 నుంచి 30 వరకు అంటే, 12 రోజుల పాటు కఠిన నిబంధనలతో లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి పళనిస్వామి వెల్లడించారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కఠిన నిబంధనలతో లాక్‌డౌన్ విధిస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే గ్రేటర్ చెన్నై పోలీసు సర్కిల్ పరిధిలోకి వచ్చే చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లా ల్లో గ్రేటర్ చెన్నై పోలీసు సర్కిల్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న బియ్యం రేషన్‌కార్డుదారులకు రూ.1000ల నగదు పంపిణీ చేయనున్నట్టు సీఎం వెల్లడించారు.
ఇక ఈనెల 21, 28 తేదీలు ఆదివారాల్లో నాలుగు జిల్లాల్లో ఎలాంటి సడలింపులు లేకుండా సంపూర్ణంగా కర్ఫ్యూ విధిస్తామని, ఆ రెండు రోజులూ ఎలాంటి వాహన, జనసంచారం ఉండదని స్పష్టం చేశారు. ఈనెల 19 నుంచి 30 వ తేదీ రాత్రి 12 గంటల వరకు చెన్నై సహా నాలుగు జిల్లాల్లో విధించనున్న నిబంధనలను ఆయన విడుదల చేశారు.