బాలీవుడ్ నెపోటిజం సుశాంత్‌ను పధకం ప్రకారం హత్య చేసిందా..!

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం రంగుల ప్రపంచాన్ని ఆడిస్తున్న చీకటి రక్కసులను వెలుగులోకి తెచ్చింది.. బాలీవుడ్‌లోని నెపోటిజం అనబడే బంధుప్రీతిని బట్టలిప్పి మరీ చూపింది... సుశాంత్‌సింగ్‌ది ఆత్మహత్యేనా? లేక పక్కా పథకం ప్రకారం చేసిన..

బాలీవుడ్ నెపోటిజం సుశాంత్‌ను పధకం ప్రకారం హత్య చేసిందా..!
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 16, 2020 | 12:56 PM

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం రంగుల ప్రపంచాన్ని ఆడిస్తున్న చీకటి రక్కసులను వెలుగులోకి తెచ్చింది.. బాలీవుడ్‌లోని నెపోటిజం అనబడే బంధుప్రీతిని బట్టలిప్పి మరీ చూపింది… సుశాంత్‌సింగ్‌ది ఆత్మహత్యేనా? లేక పక్కా పథకం ప్రకారం చేసిన హత్యనా? కంగనా రనౌత్‌ ఆగ్రహంతో.. అసహనంతో..ఆవేదనతో ఆడిన ఈ సూటి ప్రశ్నకు ఎవరు జవాబిస్తారు.. అందరూ ముసుగులు కప్పుకుని నోరు కుట్టేసుకుని ఉంటే! పాపం సుశాంత్‌ హృదయం ఎంత వేదనను అనుభవించిందో..! ఎంతటి బాధను దిగమింగుకుందో..! ఎన్నేసి అవమానాలను భరించిందో…! సుశాంత్‌ మరణం తర్వాత కొంపెల్లి జనార్దన రావు కోసం మహాకవి శ్రీశ్రీ రాసిన కవిత గుర్తుకు రాకుండా ఉండదు.. నిజమే … తలవంచుకు వెళ్లిపోయాడా మనసు విరిగిన వర్ధమాన నటుడు. సెలవంటూ లోకాన్ని వదిలిపెట్టిపోయాడు.

– తలపోసినవేవీ కొనసాగకపోగా, – పరివేదన బరువు బరువు కాగా, – అటు చూస్తే, ఇటు చూస్తే ఎవరూ – చిరునవ్వు, చేయూతా ఇవ్వక… – మురికితనం కరుకుతనం నీ – సుకుమారపు హృదయానికి గాయం చేస్తే… – అటు పోతే, ఇటు పోతే అంతా – అనాదరణతో, అలక్ష్యంతో చూసి, – ఒక్కణ్ణి చేసి వేధించారని, బాధించారని – వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా, నేస్తం!

సుశాంత్‌ మరణానంతరం బాలీవుడ్‌లో ఒక్కొక్కరుగా తమ పరివేదనను బయటపెడుతున్నారు. సుశాంత్‌ ఎంతటి క్షోభను అనుభవించాడో సవివరంగా చెబుతున్నారు.. మొసలి కన్నీరు కారుస్తున్న పెద్దల దుర్నీతిని ఎండగడుతున్నారు. నెపోటిజమ్‌ జీర్ణించుకుపోయిన వారిని తిట్టిపోస్తున్నారు. సుశాంత్‌ మరణానికి కారకులైన వారిలో ఒకరుగా భావిస్తున్న కరణ్‌జోహార్‌ కూడా ఇప్పుడు వగలేడుపులు ఏడుస్తున్నాడు.. లేని బాధను నటిస్తున్నాడు. సినిమా నేపథ్యం లేని కుటుంబాన్ని వచ్చిన సుశాంత్‌ను కరణ్‌ ఎప్పుడూ సరిగ్గా ట్రీట్‌ చేయలేదు.. కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో సుశాంత్‌ హీరోగా డ్రైవ్‌ అనే సినిమా రూపుదిద్దుకుంది. ఎందుకో తెలియదు కానీ ఆ సినిమా విడుదల లెక్కలేనన్ని సార్లు వాయిదాపడింది. ఇప్పుడంటే కరోనా వైరస్‌ కారణంగా థియేటర్లు లేవు . కాని థియేటర్లు సలక్షణంగా నడుస్తున్న సమయంలో సహేతుకమైన కారణం లేకుండా ఈ సినిమాని డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేశాడు కరణ్‌ జోహార్‌. బాలీవుడ్‌లో సుశాంత్‌కు ఎవరైనా గాడ్‌ఫాదర్‌ ఉంటే కరణ్‌ ఇంత సాహసం చేసేవాడా? ఇప్పుడు ట్విట్టర్‌లో పిట్టకూతలు కూస్తున్న ఆలియా భట్‌ కూడా ఒకానొక సందర్భంలో సుశాంత్‌ను ఎకసెక్కాలు చేయలేదూ? కాఫీ విత్‌ కరణ్‌ షోలో ఆమె ఏం కూసిందో జనాలందరికీ ఇంకా గుర్తుంది.. రణ్‌వీర్‌సింగ్‌, సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌, వరుణ్‌ ధావన్‌లలో ఎవరు మంచి నటుడు అన్న కరణ్‌ ప్రశ్నకు సమాధానమిస్తూ సుశాంత్‌ అంటే ఎవరు? అడిగిన ఆలియా భటే ఇప్పుడు సుశాంత్‌ మరణానికి సంతాపం ప్రకటిస్తోంది.

బంధుప్రీతి లేని చోటంటూ లేదు కానీ బాలీవుడ్‌లో ఇది బాగా ముదిరింది. ముదరడం కాదు .. అదో రోగంగా మారింది.. బాలీవుడ్‌లో జరిగే వేడుకలకు తనను పిలవరని సుశాంతే ఓ సందర్భంలో చెప్పుకున్నాడు.. డిప్రెషన్‌లో కూరుకుపోవడానికి బహుశా ఇదో కారణం కావచ్చేమో! కంగనా రనౌతే కాదు… తాప్సీ, హ్యూమా ఖురేషీ లాంటివాళ్లు కూడా నెపోటిజంపై గొంతెత్తారు.. కంగనా రనౌత్‌ అయితే కరణ్‌ను ఉతికి ఆరేసింది.. బాలీవుడ్‌ మాఫియా అని తిట్టిపోసింది.. ఫ్లాగ్‌ బ్యారర్‌ ఆఫ్‌ నెపోటిజమ్‌ అంటూ గట్టిగానే వాతపెట్టింది. పరిశ్రమలోని స్టార్స్‌ను తప్ప బయటవాళ్లను భరించలేడంటూ విమర్శించింది. కాయ్‌పోచె, ఎంఎస్‌ ధోని, చిచోరే వంటి గొప్ప గొప్ప సినిమాలు చేసిన సుశాంత్‌కు మీరిచ్చిన అవార్డులెన్నంటూ లెక్క చెప్పమంది.. సుశాంత్‌ మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ఊర్మిళ కూడా హిందీ సినీ పరిశ్రమలోని వికృత పోకడలను కళ్లకు కట్టినట్టు చెప్పింది. బుధుప్రీతి రాజ్యమేలుతున్న పరిశ్రమలో ప్రతిభను, కఠోరశ్రమను నమ్ముకుని నీలా ఓ గుర్తింపు తెచ్చుకోవడం కష్టమే… ఇంత సాధించిన నువ్వు ఇంత త్వరగా వెళ్లిపోవాలనుకోవడం నిజంగా బాధాకరం అంటూ నివాళి అర్పించింది ఊర్మిళ.

ప్రముఖ దర్శకుడు, నిర్మాత శేఖర్‌ కపూర్‌ అయితే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ పడ్డ ఆవేదన గురించి చెప్పుకొచ్చాడు. సుశాంత్‌ ఇలా కావడానికి కారణమైన వారు ఎవరో తనకు తెలుసన్నాడు. సుశాంత్‌ తన భుజంపై పడి కన్నీరు పెట్టుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘నువ్వు పడిన ఆవేదన నాకు తెలుసు. నిన్ను బాధపెట్టిన వ్యక్తులెవరో కూడా నాకు తెలుసు. ఆ బాధను భరించలేక, ఆ దుఃఖాన్ని మోయలేక నా భుజాలపై సేదదీరి కన్నీరు కార్చావు. గత ఆరు నెలలు నేను నీ చెంతన ఉంటే బాగుండేది.. నువ్వు కలిసినా ఇలా జరక్కపోయేది’ అంటూ శేఖర్‌కపూర్‌ ఆవేదన చెందారు. నిజానికి సుశాంత్‌తో పానీ అనే సినిమాను శేఖర్‌ కపూర్‌ తీయాల్సి ఉంది. శేఖర్‌ కపూర్‌ డ్రీమ్‌ ప్రాజెక్టు ఇది. సినిమా తీయడానికి ముందుకొచ్చిన యశ్‌రాజ్ ఫిల్మ్స్‌ అంతా రెడీ అయ్యాక వెనక్కిపోయింది. అప్పుడే సుశాంత్‌ గురించి శేఖర్‌ కపూర్‌ ఓ ట్వీట్‌ చేశాడు.’ పానీ సినిమా సెట్స్‌పై వెళ్లనందుకు నేను కూడా నీలాగే ఎంతో బాధపడుతున్నా సుశాంత్‌. ఓ సినిమా కోసం నీలా కష్టపడే నటుడ్ని నేను ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు’ అంటూ అయిదేళ్ల కిందట శేఖర్‌ కపూర్‌ ట్వీట్‌ చేశాడు. సీనియర్‌ నటుడు ధర్మెంద్ర కూడా సుశాంత్‌ మరణంతో చలించిపోయాడు. పరిశ్రమ ఎంత క్రూరమైనదో తనకు తెలుసని… నువ్వు ఎంత బాధను అనుభవించావో తాను తెలుసుకోగలనని ధర్మెంద్ర ట్వీట్‌ చేశాడు. నిర్మాత హన్సల్‌ మెహత, అనుభవ్‌ సిన్హా, గుల్షన్‌ దేవయ్యలు కూడా బాలీవుడ్‌లోని నీచ రాజకీయాలను, బంధుప్రీతిని బయటపెట్టారు. నటి మీరా చోప్రా కూడా సుశాంత్‌ మరణంపై ఆవేదన వ్యక్తం చేస్తూ తాను కూడా ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నానని చెప్పుకుంది. – బాలు