AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోబోట్లను తయారు చేసే కంపెనీకి మనుషులు కావాలి.. గంటకు రూ.4 వేల జీతం!

మనుషులు చేసే పనులను రోబోట్లతో చేయించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఓ రోబోటిక్స్ కంపెనీ ఇప్పుడు వాటిని పర్యవేక్షించేందుకు మనుషులనే నియమించుకుంటోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అమెరికాకు చెందిన ప్రముఖ హ్యూమనాయిడ్ రోబోటిక్స్ స్టార్టప్ ఫిగర్ ఏఐ (Figure AI) రోబోట్లను చూసుకునేందుకు ప్రత్యేకంగా ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి గంటకు 40 నుంచి 45 డాలర్ల వరకు వేతనం అందించనుంది..

రోబోట్లను తయారు చేసే కంపెనీకి మనుషులు కావాలి.. గంటకు రూ.4 వేల జీతం!
Company Hires Humans To Manage Its Humanoid Robots
Srilakshmi C
|

Updated on: Nov 15, 2026 | 9:05 AM

Share

కాలిఫోర్నియాకు చెందిన ఫిగర్ ఏఐ సంస్థ ఫ్యాక్టరీలు, గిడ్డంగులు (Warehouses), భవిష్యత్తులో ఇళ్లలో కూడా పనిచేయగల స్వయంప్రతిపత్తి కలిగిన హ్యూమనాయిడ్ రోబోట్లను అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో శాంటా క్లారాలో నైట్ షిఫ్ట్ కోఆర్డినేటర్ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగంలో ప్రధానంగా రోబోట్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పర్యవేక్షించాలి. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. రోబోట్లతో కలిసి పనిచేసే ఉద్యోగులను కూడా సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఫిగర్ ఏఐ అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ ఉద్యోగానికి గంటకు 40 నుంచి 45 డాలర్ల వరకు చెల్లిస్తారు. అంటే గంటకు సుమారు రూ.3,600 నుంచి రూ.4,100 వరకు (డాలర్ మారకం విలువను బట్టి) సంపాదించే అవకాశం ఉంటుంది.

రాత్రి 10:30 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు షిఫ్ట్ ఉంటుంది. మొదట కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం చేపడతారు. పనితీరు, కంపెనీ అవసరాలను బట్టి తర్వాత పూర్తిస్థాయి ఉద్యోగిగా మారే అవకాశం కూడా ఉంది. సంస్థ ప్రధాన కార్యాలయంలో వారం రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఈ ఉద్యోగం కేవలం కంప్యూటర్ ముందు కూర్చొని రోబోట్లను పర్యవేక్షించడంతో ముగిసిపోదు. ఇందులో శారీరక శ్రమ కూడా ఎక్కువగానే ఉంటుంది. సుమారు 50 పౌండ్ల (22.7 కిలోల) బరువున్న హ్యూమనాయిడ్ రోబోట్లు, వాటికి సంబంధించిన పరికరాలను స్వయంగా ఎత్తడం, కదిలించడం చేయాల్సి ఉంటుంది. ఎనిమిది గంటలకు పైగా కొనసాగే షిఫ్ట్‌లో నిర్ణీత విరామ సమయాలు మినహా ఎక్కువసేపు నిలబడి పనిచేయాలి. వంగడం, చేతులు చాపడం, పరికరాలను అందుకోవడం, రోబోట్ల హార్డ్‌వేర్‌ను జాగ్రత్తగా నిర్వహించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.

రోబోట్లు మొరాయిస్తే ఏం చేయాలి?

ఈ ఉద్యోగంలో అత్యంత కీలకమైన బాధ్యత రోబోట్లలో తలెత్తే సమస్యలను గుర్తించి పరిష్కరించడం. రోబోట్లు పనిచేయకపోతే పరిస్థితిని అంచనా వేసి కార్యకలాపాలను కొనసాగించాలా? మార్పులు చేయాలా? లేక పూర్తిగా నిలిపివేయాలా? అనే నిర్ణయాలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా..

  • రోబోట్ల నిర్వహణ కోసం మానవ ఆపరేటర్లకు పనులు కేటాయించాలి.
  • సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలి.
  • రోబోట్ల వల్ల తలెత్తే భద్రతాపరమైన సమస్యలను పర్యవేక్షించాలి.
  • పరికరాల్లో తలెత్తిన లోపాలను నమోదు చేయాలి.
  • మరమ్మతుల కోసం ఇంజినీరింగ్ బృందాలతో సమన్వయం చేసుకోవాలి.
  • రాత్రి షిఫ్ట్‌లో రోబోట్ల పనితీరుపై నివేదికలు సిద్ధం చేసి తదుపరి షిఫ్ట్ సిబ్బందికి అందించాలి.

మనుషులు చేసే పనులను రోబోట్లతో చేయించేందుకు ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు పోటీపడుతున్నాయి. అయితే ఆ రోబోట్లు సక్రమంగా పనిచేయాలంటే వాటిని పర్యవేక్షించే, సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించే మనుషుల అవసరం ఇంకా ఉందని ఫిగర్ ఏఐ ఉద్యోగ ప్రకటన స్పష్టం చేస్తోంది. ఒకవైపు మనుషుల ఉద్యోగాలను రోబోట్లు భర్తీ చేస్తాయనే చర్చ జరుగుతుండగా.. మరోవైపు ఆ రోబోట్లను చూసుకునేందుకు మనుషులకే ఉద్యోగాలు కల్పించాల్సి రావడం ఆసక్తికరంగా మారింది. భవిష్యత్తులో ఆటోమేషన్ పెరిగే కొద్దీ మనుషులు, రోబోట్లు కలిసి పనిచేసే ఉద్యోగాలు మరింత ప్రాధాన్యం పొందే అవకాశముంది.

Follow Us