పండుగ సంబరాల్లో పెను విషాదం.. చెవులు చిల్లులు పడే డీజే.. 20 రోజుల చిన్నారి మృతి!
ఉత్తరప్రదేశ్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విగ్రహ నిమజ్జన ఊరేగింపులో డీజే వాహనం నుంచి వచ్చిన భారీ శబ్దం కారణంగా 20 రోజుల పసిపాప మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బల్లియా జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విగ్రహ నిమజ్జన ఊరేగింపులో డీజే వాహనం నుంచి వచ్చిన భారీ శబ్దం కారణంగా 20 రోజుల పసిపాప మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బల్లియా జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రీమా దేవి అనే మహిళ తన అత్తగారింట్లో నవజాత శిశువును చూసుకునేవారు ఎవరూ లేకపోవడంతో గత పది రోజులుగా పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో విగ్రహ నిమజ్జన ఊరేగింపులో భాగంగా భారీ డీజే సౌండ్ సిస్టమ్తో వచ్చిన ఓ వాహనం వారి గుడిసె ముందు ఆగింది. పెద్ద శబ్దంతో సంగీతం మోగుతుండటంతో తల్లి పక్కన నిద్రిస్తున్న పాప ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించింది. కొద్దిసేపటికే పాప గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
వెంటనే పాపను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. డీజే శబ్దాన్ని తగ్గించాలని, అక్కడి నుంచి వాహనాన్ని తరలించాలని పలుమార్లు వేడుకున్నా నిర్వాహకులు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి, డీజే పరికరాలు ఉన్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీస్ అధికారి జై శంకర్ మిశ్రా తెలిపారు.
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే, పాప మరణానికి భారీ శబ్దమే కారణమా అన్నది పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తులో తేలాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
