AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిట్టలదొరగా మారిన సర్కార్ బడి పంతులు.. వేషం చూసి జనం షాక్.. అసలు విషయం తెలిసి ఫిదా!

ఉపాధ్యాయుడు అంటే పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పేవారే కాదు.. సమాజానికి మంచి మార్గం చూపించే బాధ్యత కూడా వారిపై ఉంటుంది. విద్యార్థుల్లోనే కాదు, ప్రజల్లోనూ సామాజిక చైతన్యం తీసుకురావడానికి కొందరు ఉపాధ్యాయులు వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి కోవకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

పిట్టలదొరగా మారిన సర్కార్ బడి పంతులు.. వేషం చూసి జనం షాక్.. అసలు విషయం తెలిసి ఫిదా!
Teacher Turns Pitta Dora
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Nov 15, 2026 | 8:48 AM

Share

ఉపాధ్యాయుడు అంటే పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పేవారే కాదు.. సమాజానికి మంచి మార్గం చూపించే బాధ్యత కూడా వారిపై ఉంటుంది. విద్యార్థుల్లోనే కాదు, ప్రజల్లోనూ సామాజిక చైతన్యం తీసుకురావడానికి కొందరు ఉపాధ్యాయులు వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి కోవకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. బడిలో పాఠాలు చెప్పే పంతులు.. ఒక్కసారిగా పిట్టలదొర అవతారమెత్తి నడిరోడ్డుపై కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో పిట్టలదొర వేషధారణలో ప్రత్యక్షమై ప్రజలకు సామాజిక సందేశాలు అందించారు. తనదైన హాస్య శైలితో ప్రజలను నవ్విస్తూనే.. సమాజంలో పేరుకుపోతున్న సమస్యలపై ఆలోచించేలా చేస్తున్నారు.

ముఖ్యంగా నేటి యువత మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయికి బానిసలుగా మారకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక నష్టాలను మైక్ ద్వారా ప్రజలకు వివరించారు. యువత తమ విలువైన భవిష్యత్తును మత్తు పదార్థాలకు బలి చేయవద్దని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు.

అంతేకాదు.. రోడ్డు ప్రమాదాల నివారణపైనా ఆయన ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తుచేశారు. చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తుందని హెచ్చరించారు. పాలకుర్తి రాజీవ్ చౌరస్తా, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఆయన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సాధారణ ప్రసంగాల కంటే హాస్యం, జానపద కళారూపాల ద్వారా చెప్పే సందేశాలు ప్రజలకు సులభంగా చేరుతాయని ఆయన నమ్ముతున్నారు.

ఇప్పటికే పలు రకాల వేషధారణలతో సామాజిక చైతన్యం కోసం ప్రయత్నించిన రాచకొండ ప్రభాకర్.. తాజాగా పిట్టలదొరగా మారి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. మరుగున పడుతున్న జానపద కళలను ప్రోత్సహించడంతో పాటు, వాటి ద్వారా సమాజానికి ఉపయోగపడే సందేశాలు అందించడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. నవ్వించడం ఒక కళ.. ఆ నవ్వుల మధ్య మంచి సందేశాన్ని అందించడం మరింత గొప్ప కళ. పిట్టలదొర వేషంలో రాచకొండ ప్రభాకర్ చేస్తున్న ఈ ప్రయత్నం అదే విషయాన్ని చాటిచెబుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us