పదో తరగతి అర్హతతో రైల్వేలో 4,651 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు!
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) పరిధిలోని వివిధ డివిజన్లు, వర్క్‌షాప్‌లలో మొత్తం 4,651 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా పదో తరగతి, ఐటీఐ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు 2026 డిసెంబర్ 11వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..

న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) – నార్తర్న్ రైల్వే పరిధిలో భారీగా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ డివిజన్లు, వర్క్‌షాప్‌లు, యూనిట్లలో మొత్తం 4,651 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు డిసెంబర్ 11, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.
క్లస్టర్ల వారీగా పోస్టుల వివరాలు
- క్లస్టర్ లక్నో పోస్టుల సంఖ్య: 1,525
- క్లస్టర్ అంబాలా పోస్టుల సంఖ్య: 979
- క్లస్టర్ మొరాదాబాద్ పోస్టుల సంఖ్య: 63
- క్లస్టర్ ఢిల్లీ పోస్టుల సంఖ్య: 1,312
- క్లస్టర్ ఫిరోజ్‌పూర్ పోస్టుల సంఖ్య: 740
- క్లస్టర్ జమ్మూ పోస్టుల సంఖ్య: 32
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత తప్పనిసరిగా కలిగి ఉండాలి. మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, ఎంఎంవీ, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ తదితర ట్రేడ్‌లలో ఐటీఐ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి 2026 డిసెంబర్ 11వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 11, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థులను పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ద్వారా ఎంపిక చేస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
నార్తర్న్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




