
కరోనా మహమ్మారి కట్టడిలోకి రాకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ఆన్ లైన్ లోకి మారిపోయింది. వస్తుందని అనుకున్న వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియక జనం జాగ్రత్తగా జీవిస్తున్నారు. కరోనా ఆంక్షలను పాటిస్తున్నారు. ఇంతలా కరోనా కట్టుబాట్లను పాటిస్తున్నా… పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ నెలలో ప్రారంభించాలనుకున్న విద్యా సంవత్సరం తేదీలను అన్ని రాష్ట్రాలు మార్పులు చేశాయి.
అయితే..తెలంగాణలో ఇంటర్మీడియట్ కళాశాలలను తెరిచే అంశంపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీలను తెరవాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కాలేజీలు తెరవడంపై పూర్తిస్థాయిలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల డీఈవోలకు బోర్డు కమిషనర్ ఓ నోటీసును జారీ చేశారు. కాగా, ఈ నెల 17వ తేదీ నుంచి కాలేజీలు తెరవనున్నట్లు ఇంటర్ బోర్డ్ ఇటీవల ప్రకటించింది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.