AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: వేట నిషేధం ముగిశాక.. తొలిసారి సముద్రంలోకి.. ఆ జాలర్ల పంట పండింది

రెండు నెలల వేట విరామం అనంతరం సముద్రంలోకి వెళ్లిన అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలకు మూడు అరుదైన కచిడి చేపలు చిక్కాయి. హార్బర్‌లో జరిగిన వేలంలో స్థానిక వ్యాపారి వాటిని రూ.1.50 లక్షలకు కొనుగోలు చేయగా, మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.

Andhra: వేట నిషేధం ముగిశాక.. తొలిసారి సముద్రంలోకి.. ఆ జాలర్ల పంట పండింది
Kachidi Fish
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Jun 22, 2026 | 10:13 AM

Share

సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌కు చెందిన మత్స్యకారులకు అరుదైన అదృష్టం కలిసి వచ్చింది. రెండు నెలల వేట నిషేధం ముగిసిన అనంతరం సముద్రంలోకి వేటకు వెళ్లిన వారి వలకు ఒకేసారి మూడు అరుదైన కచిడి చేపలు చిక్కాయి. ఈ ఘటన హార్బర్ పరిసరాల్లో ఆసక్తిని రేకెత్తించగా, మత్స్యకారుల్లో ఆనందం వెల్లివిరిసింది. సముద్రం నుంచి తీసుకొచ్చిన ఈ మూడు చేపలను హార్బర్‌లో బహిరంగ వేలం నిర్వహించగా, స్థానిక వ్యాపారి వాటిని మొత్తం రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశాడు. చేపలు అరుదుగా దొరకడం, వాటికి మార్కెట్‌లో ఉన్న డిమాండ్ కారణంగా వేలంలో మంచి ధర పలికింది.

స్థానిక మత్స్యకారుల వివరాల ప్రకారం, పట్టుబడిన చేపల్లో 12 నుంచి 13 కిలోల బరువున్న రెండు మగ చేపలు, ఒక ఆడ చేప ఉన్నాయి. కచిడి చేపల పొట్ట భాగంలో లభించే ప్రత్యేక పదార్థాన్ని కొన్ని ఔషధాల తయారీలో వినియోగిస్తారని, అందువల్ల ఈ చేపలకు మార్కెట్‌లో అధిక ధర ఉంటుందని వారు తెలిపారు. అలాగే, ఇంకా పెద్ద పరిమాణంలో ఉండే కచిడి చేపలు వలకు చిక్కితే ఒక్కో చేపకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ధర లభించే అవకాశం ఉంటుందని స్థానిక మత్స్యకారులు పేర్కొన్నారు. అందుకే ఈ చేపలు దొరికితే మత్స్యకారులకు భారీ ఆదాయం సమకూరుతుందని చెప్పారు.

ఒకేసారి మూడు అరుదైన కచిడి చేపలు పట్టుబడటంతో అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకుని వాటిని ఆసక్తిగా వీక్షించారు. రెండు నెలల వేట విరామం అనంతరం తొలి రోజుల్లోనే ఇలాంటి అరుదైన చేపలు లభించడం శుభసూచకంగా భావిస్తున్న మత్స్యకారులు, ఈ సీజన్‌లో మరింత మంచి వేట దొరుకుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us