అదృష్టం అంటే ఈ గోమాతదే! లక్షల విలువైన నగలు.. ఏకంగా రూ. కోటి రాజభవనం..!
రాజస్థాన్లో ఓ ఆవుపై ఉన్న అపారమైన ప్రేమ, భక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. జలోర్ జిల్లాలోని ధనోల్ గ్రామానికి చెందిన వ్యాపారవేత్త, రైల్వే కాంట్రాక్టర్ నరేంద్ర పురోహిత్ ‘రాధ’ అనే ఆవును తన కుటుంబ సభ్యురాలిగా భావిస్తున్నారు. సాధారణంగా పశువులను పెంచుకోవడం సహజమే అయినా.. రాధ విషయంలో పురోహిత్ కుటుంబం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ, ఆవుకు కల్పిస్తున్న సౌకర్యాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

రాజస్థాన్లో ఓ ఆవుపై ఉన్న అపారమైన ప్రేమ, భక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. జలోర్ జిల్లాలోని ధనోల్ గ్రామానికి చెందిన వ్యాపారవేత్త, రైల్వే కాంట్రాక్టర్ నరేంద్ర పురోహిత్ ‘రాధ’ అనే ఆవును తన కుటుంబ సభ్యురాలిగా భావిస్తున్నారు. సాధారణంగా పశువులను పెంచుకోవడం సహజమే అయినా.. రాధ విషయంలో పురోహిత్ కుటుంబం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ, ఆవుకు కల్పిస్తున్న సౌకర్యాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
కంక్రేజ్ జాతికి చెందిన అవును చేరదీసి రాధ అని పేరు పెట్టుకున్నారు. అంతేకాదు రాధకు ప్రత్యేక సందర్భాల్లో సుమారు 10 కిలోల వెండి ఆభరణాలతో అలంకరిస్తారు. హారం, నుదుటిపై ధరించే ప్రత్యేక ఆభరణాలతో పాటు ఇతర వెండి నగలను కూడా అలంకరణగా ఉపయోగిస్తారు. వీటి విలువ సుమారు రూ.24 లక్షలు ఉంటుందని పురోహిత్ కుటుంబసభ్యులు చెబుతున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పండుగల సమయంలో రాధను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు ఆవు సంరక్షణ కోసం ఏడుగురు వ్యక్తులు క్రమం తప్పకుండా పనిచేస్తున్నారు.
2019లో రాధ తమ ఇంటికి వచ్చిన తర్వాత తన జీవితంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని నరేంద్ర పురోహిత్ చెబుతున్నారు. ఒకప్పుడు నెలకు కేవలం రూ.1,500 జీతానికి పనిచేసేవాడినని, రాధ ఇంటికి వచ్చిన తర్వాత తన వ్యాపారం క్రమంగా అభివృద్ధి చెందిందని ఆయన నమ్ముతున్నారు. ప్రస్తుతం నిర్మాణ రంగంలో వ్యాపారం నిర్వహించడంతో పాటు రైల్వే కాంట్రాక్టులు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పరిణామాలన్నింటినీ రాధ ఆశీర్వాదంగానే ఆయన భావిస్తున్నారు. అందుకే కుటుంబంలో ఆమెకు మరింత ప్రత్యేకమైన స్థానం కల్పించారు.
గోమాత కోసం ‘రాధా మహల్’
గతంలో రాధ తమ కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉండేదని పురోహిత్ చెబుతున్నారు. తమ ఇంటినే ‘గోమాతా రాజభవనం’గా భావించేవారట. అయితే రాధను ఇంట్లో ఉంచడంపై కొందరు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గోమాత కోసం ప్రత్యేకంగా ఓ భారీ భవనం నిర్మించాలని నిర్ణయించుకున్నారు. 2025 నవంబర్లో సుమారు 200 గజాల స్థలంలో ‘రాధా మహల్’ నిర్మాణాన్ని ప్రారంభించారు. దాదాపు రూ.కోటి వ్యయంతో రెండు అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోని కింది అంతస్తును పూర్తిగా రాధ కోసం కేటాయిస్తున్నారు. ఆవు స్వేచ్ఛగా తిరగడానికి, ఆహారం తీసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు.. సాధువులు, ఋషులు బస చేసేందుకు గదులు, హవనాలు నిర్వహించేందుకు ప్రత్యేక స్థలం, భక్తులు కూర్చునేందుకు ఏర్పాట్లు కూడా భవనంలో ఉండనున్నాయి. నిర్మాణ పనులు కొన్ని రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Rajasthan Sacred Cow
రాధకు నందితో ‘వివాహం’..!
రాధ జీవితంలో మరో ఆసక్తికరమైన ఘట్టం కూడా ఉంది. 2021లో సాంచోర్లోని పత్మేడ గోశాలలో రాధకు ‘నంది’ అనే ఎద్దుతో మతపరమైన వివాహ వేడుక నిర్వహించినట్లు నరేంద్ర పురోహిత్ చెబుతున్నారు. ఈ వేడుకకు ధనోల్ గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు వివాహ అతిథులుగా హాజరయ్యారు. అనంతరం రాధ, నందిని వివిధ దేవాలయాలకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. తమ కుటుంబంలో గోవుల పట్ల భక్తి తరతరాలుగా కొనసాగుతోందని పురోహిత్ చెబుతున్నారు. గోసేవను తమ కుటుంబం పవిత్రమైన బాధ్యతగా భావిస్తుందని అంటున్నారు.
రాధపై నరేంద్ర పురోహిత్ కుటుంబం చూపిస్తున్న ఈ విశ్వాసం, ప్రేమ, భక్తి.. ఇప్పుడు ఓ ప్రత్యేక కథగా మారింది. ఒకవైపు రూ.24 లక్షల విలువైన వెండి ఆభరణాలు.. మరోవైపు కోటి రూపాయలతో నిర్మిస్తున్న ‘రాధా మహల్’.. ఇవన్నీ కలిపి ఈ ఆవును దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
