ఆయన ఫోన్ కాల్ రిసీవ్ చేసుకునే ప్రసక్తే లేదు, హర్యానా సీఎంపై పంజాబ్ ముఖ్యమంత్రి ఫైర్
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పై పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ నిప్పులు కురిపించారు. రైతుల ఆందోళన గురించి ఖట్టర్ కు ఏం తెలుసునని అన్నారు. అలాంటిది ఆయన ఫోన్ కాల్ ను ఎందుకు..
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పై పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ నిప్పులు కురిపించారు. రైతుల ఆందోళన గురించి ఖట్టర్ కు ఏం తెలుసునని అన్నారు. అలాంటిది ఆయన ఫోన్ కాల్ ను ఎందుకు రిసీవ్ చేసుకోవాలని ప్రశ్నించారు. తమ డిమాండ్లకు సంబంధించి నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందని, తామేమీ వారిని ఆపడం లేదని ఆయన అన్నారు. కానీ మీరెందుకు ఆపుతున్నారు ? అన్నదాతలపై పోలీసుల చేత టియర్ గ్యాస్ ప్రయోగించేలా చూస్తున్నారు, వారి ఆందోళనను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు, మేము గానీ, ఢిల్లీ గానీ వారిని ఆపనప్పుడు మధ్య మీకేం నష్టం వచ్చింది అని అమరేందర్ సింగ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. మీరు పది సార్లు ఫోన్ చేసినా దాన్ని ఎత్తబోనని ఖరాఖండిగా చెప్పారు.
రైతుల ఆందోళనకు పంజాబ్ సీఎం బాధ్యుడని ఖట్టర్ ఆరోపించిన కొద్ధి సేపటిలోనే అమరేందర్ సింగ్ ఆగ్రహించారు. తమది న్యాయ సమ్మతమైన డిమాండ్లని రైతులు అంటున్నారని, నిజంగానే వారి డిమాండ్లు సహేతుకమైనవని ఆయన పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలపట్ల తాను కూడా నిరసన తెలిపానని ఆయన అన్నారు. ఇటీవలే అమరేందర్ సింగ్ ఢిల్లీలో ఈ చట్టాలను నిరసిస్తూ ధర్నా చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కలిసేందుకు కూడా యత్నించగా ఆయన అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు నిరాకరించారు.