సెల్ఫీ.. దీనికి ప్రస్తుతం ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సెలబ్రిటీలు కనిపిస్తే వారితో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ.. తమ మిత్రులకు ఆ అనుభూతుల్ని షేర్ చేసుకుంటూ.. వారి వారి స్టేటస్‌లను పరిచయం చేసుకుంటారు. అయితే ఈ సెల్ఫీ మోజు.. రాజకీయాల్లో కూడా అదే స్థాయిలో ఉంది. ప్రముఖ రాజకీయ నాయకులు ఎవరైనా కలిస్తే చాలు.. వాళ్లతో ఫోటోలు దిగడం.. వాటిని వారి సోషల్ మీడియా ఖాతాల్లో అప్‌లోడ్ చేయడం.. ఇది ప్రస్తుతం ఉన్న తీరు. అయితే ఈ సెల్ఫీలు ఇప్పుడు.. తెలంగాణ రాజకీయ నేతల్లో వివాదాలకు దారి తీస్తున్నాయట. సెల్ఫీలు ఏంటీ.. వివాదాలు ఏంటీ అనకుంటున్నారా..? నిజమే మహబూబాబాద్‌లో అధికార పార్టీ కార్యకర్తలకు ఈ వింత పరిస్థితి ఎదురవుతోంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే,ఎంపీ ఇద్దరూ అధికారపార్టీకి చెందినవారే. అయితే ఇద్దరి మధ్య ఆధిప్యతపోరుతో కార్యకర్తలు నలిగిపోతున్నారట.
కార్యకర్తలు ఎవరైనా.. ఎంపీతో సన్నిహితంగా ఉంటే.. ఎమ్మెల్యేకు కోపం వస్తుందట. ఇక ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉంటే ఎంపీకి కోపం వస్తుందట. అంతేకాదు.. ఎవరైనా కార్యకర్తలు ఎంపీతో ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. వారిపై ఎమ్మెల్యే గుర్రుగా ఉంటున్నారట. ఇటు ఎమ్మెల్యేతో సెల్పీలు దిగితే వారిపై ఎంపీ వర్గం నుంచి పంచ్ పడుతుందట. ఇలా ఇద్దరి మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారట.
అయితే ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుకు చాలా పెద్ద చరిత్రే ఉంది. గతంలో ఎంపీ, ఎమ్మెల్యేలు ఇద్దరు ప్రత్యర్థులు. ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌లో కవిత ఫ్యామిలీ చేరింది. దీంతో ఎమ్మెల్యే టికెట్ విషయంలో శంకర్ నాయక్ వర్సెస్ కవిత ఫైట్ నడిచింది. అయితే టికెట్ శంకర్ నాయక్ వచ్చింది. ఆయన రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే తనకు టికెట్ రాకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన పార్టీ కార్యకర్తలపై ఆయన కక్ష గట్టారనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే కవిత ఎంపీగా గెలిచిన తర్వాత శంకర్‌నాయక్ కొంత తగ్గారట. కానీ ఎంపీ దగ్గర క్లోజ్‌గా ఉంటూ తన దగ్గర ఫోజులు కొడితే మాత్రం ఆయన అస్సలు సహించారట. ఈ ఇద్దరి నేతలు మధ్య ఆధిపత్య పోరు.. కార్యకర్తలకు శాపంగా మారిందట.
ఈ మధ్య గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో లోకల్ లీడర్లు ఎమ్మెల్యే, ఎంపీ దగ్గర చక్కర్లు కొడుతున్నారు. అయితే ఒకరి దగ్గర ఫోటో దిగితే…మరొకరికి కోపం. దీంతో చాలా మంది ఇప్పుడు ఫోటోలు అంటేనే భయపడుతున్నారట. ఎమ్మెల్యే, ఎంపీలతో ఫోటో దిగి.. వారి ఆగ్రహానికి గురయ్యేకంటే.. ఫోటోలు దిగకపోవడమే ఉత్తమమని ఊరుకుంటున్నారట. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా అధికార పార్టీ కేడర్‌లో ఈ సెల్ఫీ ఫోటో గోలపై హాట్‌హాట్‌గా చర్చకొనసాగుతోంది.