2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిః జగన్

|

Feb 11, 2020 | 12:50 PM

Polavaram Project Details: ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్ట్ పనులు 2021 జూన్ నాటికి పూర్తవుతాయని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్ట్‌పై ఎంతో ధ్యాస పెట్టి చేస్తున్నామని.. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. గత ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణంలో విజన్ లోపించడం వల్ల స్పిల్ వే పూర్తి చేయకుండానే కాపర్ డ్యామ్ నిర్మాణం ప్రారంభించారన్నారు. దీని వల్ల వరదనీరు స్పిల్ వే […]

2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిః జగన్
Follow us on

Polavaram Project Details: ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్ట్ పనులు 2021 జూన్ నాటికి పూర్తవుతాయని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్ట్‌పై ఎంతో ధ్యాస పెట్టి చేస్తున్నామని.. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. గత ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణంలో విజన్ లోపించడం వల్ల స్పిల్ వే పూర్తి చేయకుండానే కాపర్ డ్యామ్ నిర్మాణం ప్రారంభించారన్నారు. దీని వల్ల వరదనీరు స్పిల్ వే వైపు పోవడంతో పనులకు తీవ్ర ఆటంకం కలిగి నవంబర్‌ వరకూ ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇదంతా కేవలం గత ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను మిస్ హ్యాండిల్ చేయడం వల్లే జరిగిందని ఆయన విమర్శించారు.

సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం…

అటు సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన విషయంపై కూడా మాట్లాడిన జగన్.. ఈ విధానం రావడంతో  వచ్చే 20 ఏళ్లలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని హామీ ఇచ్చారు. అది మన భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక అన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యాకమిటీలు కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియాన్ని ఆమోదించాయని ఆయన అన్నారు.

రాజధాని వికేంద్రీకరణ…

రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై మరోసారి మాట్లాడిన జగన్.. తాను చెప్పాల్సింది అంతా అసెంబ్లీలోనే స్పష్టం చేశానని తెలిపారు. గత ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని ఎంచుకునే విధానం సరైనది కాదని ఆయన అన్నారు. ఇప్పటికీ ఆ ప్రాంతానికి సింగిల్‌ రోడ్డులోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎం స్పష్టం చేశారు. అంతేకాకుండా రాజధాని ప్రాంత అభివృద్ధిలో గత ప్రభుత్వం తప్పుడు లెక్కలను చూపించిందని మండిపడ్డారు. అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రతి ఏటా రూ.6 నుంచి 7 వేల కోట్లు ఖర్చు చేసే బదులు అందులో 10శాతం విశాఖపట్నంలో పెడితే కచ్చితంగా మార్పు వస్తుందని ఆయన అన్నారు. ఇవాళ కాకపోయినా 10 ఏళ్లకైనా ఆంధ్రప్రదేశ్.. హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరులతో పోటీపడే పరిస్థితి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కియా మోటార్స్ వ్యవహారం…

ఆంధ్రప్రదేశ్ నుంచి కియా మోటార్స్ తరలిపోతుందంటూ తప్పుడు వార్త ప్రచారమైందన్నారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా వార్తా కథనాన్ని ఇచ్చారని సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన కథనమని.. తాము ఎక్కడికీ వెళ్లడంలేదంటూ కియా వరుసగా ప్రకటనలు చేస్తున్నా… వాళ్లు వాస్తవాలు పట్టించుకోవడం లేదన్నారు. రాజకీయాల కోసం వ్యవస్థలను మేనేజ్‌ చేసి ఏ స్థాయికైనా దిగజారే పరిస్థితి చూడాల్సి వస్తోందన్నారు.

తన మీద బురద జల్లడం, నిందలు వేయడం ఇప్పడు మొదలుపెట్టింది కాదని.. ఇవన్నీ అలవాటైపోయాయని ఆయన చెప్పుకొచ్చారు. నిజాలతో పనిలేకుండా ఒక మనిషికి చెడ్డపేరును ఆపాదించాలన్న ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయన్నారు. గతంలో తమ పార్టీలోని 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేశారు. ఎన్నికల తర్వాత వారికి వచ్చిన సీట్లు 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే. దేవుడు రాసిన గొప్ప స్క్రిప్టు ఇది. వాళ్లు చేసే పాపాలు కొద్దీ దేవుడు అయ్యో పాపం అంటూ.. తమ పక్కనే ఉంటాడని జగన్ తెలిపారు.

ప్రత్యేక హోదా…

మరోవైపు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తూ.. అది పూర్తయిన అధ్యాయం కాదని.. అసలు ఆ మాట అనడం సరికాదని జగన్ తెలిపారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న తమ ప్రయత్నాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయని.. ప్రతీసారి తాము కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రానికి ఎప్పటికైనా తమ అవసరం వస్తుందని.. ఆ రోజున తమ పార్టీ ఎంపీలు కీలకం కానున్నారని జగన్ వెల్లడించారు.