సీఎంలతో ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్
దేశంలో కరోనా వ్యాప్తిని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్యశాఖ మంత్రులతో..
PM Modi Video Conference : దేశంలో కరోనా వ్యాప్తిని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్యశాఖ మంత్రులతో ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు, ఆరోగ్యశాఖ మంత్రులతో జరిగే వర్చువల్ సమావేశంలో ప్రధాని కరోనా నియంత్రణ చర్యలపై సమీక్షించనున్నారు.
దేశంలో 63శాతం యాక్టివ్ కేసులు ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉండగా, మొత్తం కరోనా కేసుల్లో 65.5శాతం, మరణాల్లో 75 శాతం వరకు ఆయా రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీలో కరోనా మరణాలు దేశ సగటు 1.6 శాతం కంటే ఎక్కువగా.. రెండు శాతం ఉండడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహమ్మారి కట్టడికి ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, కేంద్రం సహకారం, ఆరోగ్య, వైద్య మౌలిక సదుపాయాల పెంపు తదితర అంశాలను సైతం చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.