అక్కడ మరణం తర్వాత నరకమే.. అద్దె కట్టకపోతే సమాధి నుంచి శవాన్ని తీసి పడేస్తారు.. ఎక్కడో తెలుసా..?
బతికున్నప్పుడు అద్దె కట్టడం మనందరికీ తెలుసు. కానీ చనిపోయిన తర్వాత కూడా నెలనెలా అద్దె కట్టాల్సిందేనని, లేదంటే సమాధిలోంచి ఖాళీ చేయిస్తారని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా.. ఒక దేశంలో మరణం తర్వాత కూడా అద్దె కట్టలేక జనం బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఆ వింత ఆచారం ఏంటి? ఆ దేశం ఎక్కడుంది? అనే విషయాలు తెలుసుకుందాం..

సాధారణంగా మనుషులు బ్రతికి ఉన్నప్పుడు ఇల్లు అద్దెకు తీసుకోవడం చూస్తుంటాం. కానీ మరణించిన తర్వాత కూడా సమాధిని అద్దెకు తీసుకోవాల్సి రావడం, గడువు ముగిస్తే అక్కడి నుండి మృతదేహాలను ఖాళీ చేయించడం ఎక్కడైనా విన్నారా? వినడానికి వింతగా ఉన్నా.. బొలీవియాలోని లా పాజ్‌లో ఉన్న సెమెటేరియా జనరల్ స్మశానవాటికలో ఇదే నిబంధన అమలవుతోంది. బొలీవియాలోనే అతిపెద్దదైన ఈ స్మశానవాటిక దాదాపు 210 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ సుమారు 20 లక్షల మృతదేహాల అవశేషాలు ఉన్నట్లు అంచనా. ప్రభుత్వం నిర్వహించే ఈ స్మశానవాటికలో ఏటా 50,000 మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతుంటాయి. ఇది కేవలం ఒక స్మశానవాటిక మాత్రమే కాదు, కోట్లాది డాలర్ల లావాదేవీలు జరిగే ఒక భారీ వ్యవస్థ.
అద్దె చెల్లించకపోతే నోటీసులు తప్పవు
ఇక్కడి ప్రధాన నిబంధన ఏమిటంటే.. ఎవరికైనా కేవలం ఐదు సంవత్సరాల కాలానికి మాత్రమే సమాధి స్థలం లభిస్తుంది. ఐదు ఏళ్లు పూర్తయిన తర్వాత, మృతుడి బంధువులు నిర్ణీత అద్దె చెల్లించాలి. ఒకవేళ అద్దె చెల్లించడంలో విఫలమైతే ప్రభుత్వం ఆ సమాధిపై ఒక ప్రకటనను అతికిస్తుంది. అప్పటికీ స్పందించకపోతే ఆ సమాధిని తవ్వి మృతదేహాలను బయటకు తీసి పారవేస్తారు. తమ వారి అవశేషాలు అలా పారవేయకూడదని భావించే ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో అద్దె చెల్లిస్తూ ఉంటారు.
అపార్ట్‌మెంట్లను తలపించే సమాధి గోడలు
అంత్యక్రియలు జరిగిన పదేళ్ల తర్వాత మృతదేహాలను బయటకు తీసి దహనం చేస్తారు. ఆ తర్వాత వచ్చే బూడిద లేదా ఎముకలను భద్రపరచుకోవడానికి స్మశానవాటిక గోడల్లో గాజుతో కప్పబడిన చిన్న మందిరాలను అద్దెకు ఇస్తారు. వందలాది చిన్న తలుపులతో ఉండే ఈ గోడలు మూడు, నాలుగు అంతస్తుల అపార్ట్‌మెంట్ బ్లాక్‌లలా కనిపిస్తాయి. బంధువులు ఆ చిన్న గదుల్లో మృతుడి జ్ఞాపకార్థం పువ్వులు, ఫొటోలు, చిన్న చిన్న స్మారక చిహ్నాలను అలంకరిస్తారు.
వ్యాపారంగా మారిన అంతిమ యాత్ర
సరైన రుసుము చెల్లిస్తేనే ఇక్కడ మృతదేహాలకు గౌరవం లభిస్తుంది. లేదంటే సమాధి నుంచి బహిష్కరణ తప్పదు. అందుకే స్థానిక ప్రజలు తమ ప్రియమైన వారి అవశేషాలను భద్రంగా ఉంచుకోవడానికి ఏటా నిరంతరాయంగా అద్దె చెల్లిస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం వేలాది మంది సందర్శకులు ఇక్కడికి వచ్చి తమ బంధువుల జ్ఞాపకాలకు నీరు, పువ్వులు సమర్పించి నివాళులు అర్పిస్తుంటారు. మరణం తర్వాత ఏమీ తీసుకుపోలేం అంటారు కానీ, బొలీవియాలో మాత్రం మరణించిన తర్వాత కూడా అద్దె కట్టడానికి డబ్బులు సిద్ధం చేసుకోవాల్సిందేనని ఈ స్మశానవాటిక నిరూపిస్తోంది.
