AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Controversy : డగౌట్‌లో ఫోన్ వాడి అడ్డంగా దొరికిపోయిన రోమీ భిందర్.. రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ

IPL 2026 Controversy : ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) టీమ్ మేనేజర్ రోమీ భిందర్ చుట్టూ పెద్ద దుమారమే రేగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా డగౌట్‌లో మొబైల్ ఫోన్ వాడటం ఇప్పుడు ఆయనను చిక్కుల్లో పడేసింది. ఈ ఘటనపై బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) సీరియస్ అయ్యింది. అసలు ఏం జరిగిందంటే..

IPL 2026 Controversy : డగౌట్‌లో ఫోన్ వాడి అడ్డంగా దొరికిపోయిన రోమీ భిందర్.. రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ
Ipl 2026 Controversy
Rakesh
|

Updated on: Apr 13, 2026 | 8:12 AM

Share

IPL 2026 Controversy : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ డగౌట్‌లో ఒక వింత దృశ్యం కెమెరాకు చిక్కింది. రాజస్థాన్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ తన మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తుండగా, పక్కనే ఉన్న యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ ఆ ఫోన్ వైపు తొంగి చూడటం స్పష్టంగా కనిపించింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా(PMOA)లో మొబైల్ ఫోన్లు లేదా స్మార్ట్ వాచ్‌లు వాడటం ఖచ్చితంగా నిషిద్ధం. కేవలం టీమ్ అనలిస్ట్‌కు మాత్రమే లాప్‌టాప్ వాడే అనుమతి ఉంటుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు మాజీ ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోదీ కూడా దీనిపై స్పందిస్తూ భద్రతా లోపాలను వేలెత్తి చూపారు. దీనిపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందిస్తూ.. ఏసీయూ అధికారులను నివేదిక కోరినట్లు తెలిపారు. సాధారణంగా చాలా తక్కువ మంది అధికారులకు మాత్రమే ఫోన్ వాడే వెసులుబాటు ఉంటుంది. ఆ జాబితాలో రోమీ భిందర్ పేరు ఉందో లేదో ఇప్పుడు చెక్ చేస్తున్నారు. ఒకవేళ ఆయనకు అనుమతి లేకపోతే అది తీవ్రమైన ప్రోటోకాల్ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.

శిక్ష ఏముండవచ్చు?

బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. ఇది పొరపాటున జరిగినదా లేక ఉద్దేశపూర్వకంగా చేసినదా అనే కోణంలో విచారణ జరుగుతోంది. యాంటీ కరప్షన్ యూనిట్ ఇచ్చే రిపోర్టు ఆధారంగా మ్యాచ్ రిఫరీ తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ వ్యవహారంలో రోమీ భిందర్‌కు భారీ జరిమానా పడే అవకాశం ఉంది లేదా కొన్ని మ్యాచ్‌ల పాటు ఆయనను డగౌట్‌లోకి రాకుండా నిషేధించే అవకాశం కూడా ఉంది. ఐపీఎల్ యాజమాన్యం ఇలాంటి విషయాల్లో జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తోంది.

వివాదం వెనుక అనుమానాలు

మ్యాచ్ మధ్యలో డగౌట్‌లో ఫోన్ వాడటం వల్ల బెట్టింగ్ లేదా ఫిక్సింగ్ కు సంబంధించిన సమాచారం చేరవేసే అవకాశం ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే బీసీసీఐ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్ తన తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 13న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. ఈ లోపే ఈ వివాదంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టీమ్ మొత్తం ఈ వివాదం వల్ల మానసికంగా ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలని యాజమాన్యం ప్రయత్నిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us