జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ యాత్రకు రంగం సిద్దమవుతోంది. మంగళవారం నాడు ఏపీ రాజధాని అమరావతి ప్రాంత పర్యటనతో తనదైన దూకుడును ప్రదర్శించిన పవన్ కల్యాణ్ నెక్స్ట్ స్టెప్ వేసేందుకు రెడీ అవుతున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా త్వరలో హస్తిన యాత్రకు ఆయన రెడీ అవుతున్నారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి పవన్ ఢిల్లీ యాత్ర లక్ష్యమేంటి?
ఏ క్షణంలో ఏపీకి మూడు రాజధానులుండే ఛాన్స్ వుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేశారో.. అప్పుడే విపక్షాలకు ఓ అంశాన్ని ఇచ్చినట్లయ్యింది. జగన్ ప్రకటన.. తర్వాత నాలుగు రోజులకు జిఎన్ రావు కమిటీ ఆల్ మోస్ట్ జగన్ మాటలకు అనుగుణంగానే నివేదిక ఇవ్వడంతో విపక్షాలకు అస్త్రం లభించింది. రాజధాని ప్రాంతంలోని ప్రజలకు వున్న సెంటిమెంట్‌ను క్యాచ్ చేసేందుకు ఓ వైపు టీడీపీ, మరోవైపు జనసేన పార్టీ పోటీ పడ్డాయి.
ఇందులోభాగంగా రాజధాని ప్రాంత రైతులకు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉద్యమిస్తుండగా.. జనసేనాని మాత్రం నాలుగైదు రోజులు ఫ్యామిలీతో విహార యాత్రకు వెళ్ళి వచ్చారు. వస్తూ వస్తూనే రాజధాని ఉద్యమ బరిలోకి దిగారు జనసేనాని. మంగళవారం నాడు అమరావతి ప్రాంతంలో పవన్ కల్యాణ్ జరిపిన పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగాను, ఉద్రిక్తంగాను కొనసాగింది. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులను తనదైన శైలిలో రిసీవ్ చేసుకున్న పవన్ కల్యాణ్.. రాజధాని తరలింపు విషయంలో జగన్ ప్రభుత్వానికి పునరాలోచన చేయాల్సిన పరిస్థితిని కలుగ చేశారు పవన్ కల్యాణ్.
అదే ఊపును కొనసాగించేందుకు ఇపుడు ఢిల్లీ యాత్రకు జనసేనాని సిద్దమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ యాత్ర ద్వారా రెండు లక్ష్యాలను నెరవేర్చుకునే వ్యూహంలో పవన్ కల్యాణ్ వున్నారని చెప్పుకుంటున్నారు. రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం జిమ్మిక్కులు చేస్తోందని భావిస్తున్న పవన్ కల్యాణ్.. దాన్ని ఢిల్లీ పెద్దల ముందు సాక్ష్యాధారాలతో నిరూపించి.. జగన్ క్రెడిబిలిటీని ప్రశ్నార్థంలో పడేయాలన్నది పవన్ ఫస్ట్ వ్యూహం అంటున్నారు.
కొన్ని రోజుల క్రితం రాయలసీమ పర్యటనలో బీజేపీకి స్నేహహస్తమందించిన పవన్ కల్యాణ్.. ఆ పనిని కూడా చక్కబెట్టుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ-బీజేపీ బంధం వుందా? ఒకవేళ వుంటే దాన్ని బ్రేక్ చేసేందుకు తన ఢిల్లీ పర్యటనను వినియోగించుకోవాలన్నది పవన్ కల్యాణ్ రెండో ఎత్తుగడగా చెబుతున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ-జనసేన మిత్రబంధంతో వైసీపీ కంచుకోటను బ్రేక్ చేయాలన్నది పవన్ దీర్ఘకాలిక వ్యూహమని చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగా తన ఢిల్లీ యాత్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలతో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసేందుకు జనసేనాని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. ఒక్క యాత్రతో రెండు లక్ష్యాలు నిర్దేశించుకున్న పవన్ కల్యాణ్ ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.