AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Galwan Attacks: గల్వాన్ లోయలో ఘర్షణలకు ఏడాది..అప్పుడు ఏం జరిగింది..ఇప్పుడు భారత చైనా సరిహద్దుల్లో పరిస్థితి ఎలా ఉంది?

Galwan Attacks: మనదేశానికి పక్కలో బల్లెం లాంటిది చైనా. పైకి నవ్వుతూనే పక్క నుంచి పోటు పొడవడం దానికి అలవాటు. దాని దృష్టి ఎప్పుడూ ప్రపంచ ఆధిపత్యం పైనే..

Galwan Attacks: గల్వాన్ లోయలో ఘర్షణలకు ఏడాది..అప్పుడు ఏం జరిగింది..ఇప్పుడు భారత చైనా సరిహద్దుల్లో పరిస్థితి ఎలా ఉంది?
Galwan Attacks
KVD Varma
|

Updated on: Jun 14, 2021 | 6:20 PM

Share

Galwan Attacks: మనదేశానికి పక్కలో బల్లెం లాంటిది చైనా. పైకి నవ్వుతూనే పక్క నుంచి పోటు పొడవడం దానికి అలవాటు. దాని దృష్టి ఎప్పుడూ ప్రపంచ ఆధిపత్యం పైనే.. భారత సరిహద్దుల్లో భూభాగాన్ని ఆక్రమించుకోవడం కోసమే ఎప్పుడూ గోతి దగ్గర నక్కలా కాచుకుని ఉంటుంది. ఎదో వంకతో సరిహద్దుల్లోకి చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అటువంటి ప్రయత్నమే గత సంవత్సరం గట్టిగా చేసింది చైనా. కానీ, భారత సైన్యం ముందు ఆ పప్పులు ఉడకలేదు. మన సైనికుల దెబ్బకు తోకముడిచి అవతలకు జరిగాయి చైనా బలగాలు. ఇది జరిగింది గతేడాది జూన్ 15న. గల్వాన్ లోయలో మన సరిహద్దుల్లోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించి చైనా భంగపడింది. ఆ ఘర్షణ ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఒకసారి గమనిద్దాం..

2017లో బీజం..

సిక్కిం సరిహద్దుల్లోని డొక్లాం పై చైనా రగడ ప్రారంభించింది. అక్కడ తమ సైన్యాన్ని మోహరించి భారత్ తో కయ్యానికి కాలు దువ్వింది చైనా. ఈ సమయంలో రెండు దేశాల సైన్యాలు ఢీ అంటే ఢీ అంటూ సమరం చేశాయి. ఇది భారత్-చైనా సంబంధాల పై ప్రభావం చూపించింది. దీంతో రంగంలోకి దిగిన ఇరు దేశాలు, అనధికార సమావేశాలు నిర్వహించాయి. రెండు దేశాల మధ్య సంస్కృతి, సంబంధాలను చాటుతూ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశం అయ్యారు. చేతిలో చేయి కలిపి నడుచుకుంటూ ఫోటోలు దిగారు. రెండు దేశాల మధ్య చాలా అంశాల్లో వైరుద్ధ్యాలు, అయినా అంతా సవ్యంగానే ఉందనే సంకేతాలు ప్రజలకు పంపించారు. కానీ, ఆ తరువాత పరిస్థితులు మరింత కఠినంగా మారిపోయాయి. చైనా పైకి భారత్ తో సఖ్యంగా ఉన్నట్టు నటిస్తూనే.. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తూ వస్తోంది. సరిహద్దుల్లో ఎక్కడో ఒకచోట చైనా సైనికులు భారత్ లోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నించడం భారత సైన్యం వారిని నియంత్రించడం జరుగుతూ వస్తోంది.

2020 జూన్ 15..

లాడ్డాఖ్ లోని గల్వాన్ లోయలో రెండు దేశాల మధ్య ఒక్కసారిగా ఘర్షణలు జరిగాయి. రెండు దేశాల సైనికుల మధ్యా బాహాబాహీగా భౌతిక దాడులకు పాల్పడ్డారు. లాడ్డాఖ్ లోని ప్యాంగ్యాంగ్ సొ సరస్సు వద్ద ఈ ఘర్షణలు జరిగాయి. అయితే, దీనికి నెల రోజుల ముందు నుంచే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మే 21, 2020..భారత సైన్యం సరిహద్దులు దాటుతోందని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ కూడా స్పందించారు. రోజువారీగా భారత్ చేపట్టే గస్తీ విధులకు చైనా సైన్యమే అడ్డు తగిలిందని అనురాగ్ చెప్పారు.

జూన్ 6, 2020..లద్దాఖ్‌లో భారత్, చైనా దౌత్యవేత్తలు, సైనిక కమాండర్లు ఈ విషయంపై చర్చలు జరిపారు. ఆ కూడా తర్వాత పలు దఫాలుగా సంప్రదింపులు జరిగాయి. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు రెండు దేశాలు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఇరు దేశాల ప్రకటనలుచేశాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చర్చలు జరిపారు. ఇదిలా ఉండగానే లాడ్డాఖ్ లోని ప్యాంగ్యాంగ్ సొ సరస్సు వద్ద రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయాన్ని జూన్ 16, 2020న భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. జూన్ 15న విధ్వంసకర ఘర్షణలు జరిగాయి. రెండు వైపులా మరణాలు జరిగాయన్నభారత సైన్యం. గల్వాన్ లోయలో పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోందని చెప్పింది.

జూన్ 15న వాస్తవాధీన రేఖను దాటుకుంటూ భారత బలగాలు వచ్చాయని చెప్పిన చైనా..భారత బలగాలు తమ సిబ్బందిని రెచ్చగొట్టాయని చెప్పారు. రెండు వైపులా భౌతిక దాడులు జరిగాయని చైనా వెల్లడించింది. అయితే, చైనా వైపు 45 మందికిపైగా మరనిన్చారని భారత ప్రభుత్వం చెప్పింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు మేజర్ జనరల్ స్థాయి చర్చలు ప్రారంభించినట్టు వివరించింది. ఈ ఘటనలో భారత జవాన్లు ఎవరూ మిస్ కాలేదని భారత ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి న్యూస్ సర్వీస్ పేర్కొంది.

గల్వాన్ ఘర్షణలు ఎలా జరిగాయి..

చైనా బలగాలు వాస్తవాధీన రేఖను దాటటం, తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేయడం చేశాయి. గస్తీ పాయింట్ 14 వరకు ఈ శిబిరాలు కనిపించాయి. అప్పుడే ఘర్షణలు, ఆ తర్వాత ఈ గస్తీ పాయింట్ దగ్గర శిబిరాలను వదిలేసిన చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయినట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించింది. గల్వాన్‌లో వెనక్కి వెళ్లినా అక్సాయ్ చిన్ ప్రాంతంలో కొత్త శిబిరాలు ఏర్పాటు చేసింది చైనా జూన్ 19, 2020..ఘర్షణలపై అఖిల పక్ష సమావేశం పెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..ఎవరినీ మన భూభాగంలోకి అడుగు పెట్టనివ్వలేదు. మన శిబిరాలు వేరేవాళ్ల నియంత్రణలోకి వెళ్లలేదని చెప్పారు. ఏప్రిల్ 2020 నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి, భారత సేనలే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాయని చైనా ఆరోపించింది.

జూలై 3, 2020న ప్రధాని మోదీ సైనికుల్ని కలిసేందుకు లద్దాఖ్ వెళ్ళారు. మీరు బాగా పోరాడుతున్నారని సైనికులకు ప్రశంసలు అందించారు మోడీ. ఆగస్టు 31, 2020..చైనా బలగాలను విజయవంతంగా వెనక్కి పంపించగలిగామని భారత్ ప్రకటించింది. ‘ప్యాంగ్యాంగ్ సో సరస్సుకు దక్షిణాన భారత బలగాలు మళ్లీ సరిహద్దులను ఉల్లంఘించాయని చైనా ఆరోపించింది. భారత్, చైనా సరిహద్దులకు పశ్చిమాన ఉన్న రెకిన్ పర్వత ప్రాంతంలో ఉల్లంఘనలని ప్రకటించింది.

సెప్టెంబర్ 5, 2020..మాస్కోలో రెండు దేశాల (భారత్, చైనా) రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులు భేటీ అయ్యారు. రెండు దేశాలు ఒకరిపై మరొకరు కాల్పులు జరిపారని ఆరోపణలు గుప్పించుకున్నారు. ‘పరిస్థితులు దిగజారుతున్నాయి. భారత్, చైనాలకు సాయం అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. సెప్టెంబరు 22, 2020..పరిస్థితులు మరింత దిగజారకుండా చర్యలు తీసుకుంటామని భారత్, చైనా సైన్యాలు సంయుక్త ప్రకటన చేశాయి. వెంటనే వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు ఉభయ దేశాలూ అంగీకారం తెలిపాయి.

ఫిబ్రవరి 10, 2021.. ప్యాంగ్యాంగ్ సో సరస్సు దగ్గర రెండు వైపులా యుద్ధ ట్యాంకులు, బలగాలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఈ ఘర్షణల్లో చైనా సైనికులు 45 మంది మరణించారని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టీఏఎస్ఎస్ కథనం తమవైపు నలుగురే చనిపోయారని చైనా చెప్పింది. చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించడమే కాకుండా భారత్‌లోకి వచ్చే చైనా సరుకులపైనా ఆంక్షలు విధించింది.

ఇప్పుడు పరిస్థితి ఇదీ..

మే14, 2021..భారత్‌లో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభణ మొదలైంది. దీంతో అత్యవసర సామగ్రి కోసం చైనాను ఆశ్రయించింది భారత్. ఒక్క ఏప్రిల్‌లోనే 26,000 వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్‌కు చైనా సరఫరా చేసింది. 15,000 పేషెంట్ మానిటర్లు, 3800 టన్నుల మెడికల్ సామగ్రిని చైనా పంపించింది. భారత్ మొత్తం 70,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 30 టన్నుల వ్యాక్సీన్ ముడి పదార్థాల ఆర్డర్లు ఇచ్చింది. జూన్ 2, 2021..రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్లలేదు అంటూ భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి ఆరిందమ్ బాగ్చి ప్రకటించారు.

వాస్తవాధీన రేఖ సరిహద్దుల వెంబడి సైనికుల మోహరింపు.. రెండు వైపులా పెరిగిన గస్తీ, మౌలిక వసతుల నిర్మాణాలు.. ఇరు వైపులా అనుమానాలు, దీంతో పరిస్థితులు మళ్లీ అదుపు తప్పే ముప్పు ఇంకా పొంచే ఉంది. ఇక పరిశీలకులు చెబుతున్న దాని ప్రకారం మే 2020కి ముందులేని ప్రాంతాల్లో ప్రస్తుతం చైనా సేనలు ఉన్నాయి. అయితే, ఈ సమయంలో అమెరికాతో భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయి. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన క్వాడ్ కూటమికి దగ్గరైన భారత్.. చైనాకు కళ్లెం వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Also Read: Israel New Prime Minister: ఇజ్రాయెల్‌లో పెద్ద మార్పు.. నెతన్యాహు ఔట్.. నఫ్తాలీ బెన్నెట్‌ ఇన్..

Guinness World Records: కృత్రిమ కాలుతో గోడకుర్చీ…దివ్యాంగ మహిళ గిన్నీస్ రికార్డు – Watch Video