e-Amrit: ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇకపై క్షణాల్లో.. ఇ-అమృత్ పోర్టల్ ప్రారంభించిన ప్రభుత్వం!
పెట్రోల్, డీజిల్ ధరలు అందుబాటులో లేని స్థాయికి చేరుకున్నాయి. ఇంకా పైపైకి పరుగులు తీస్తున్నాయి. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం కూడా లెక్కలకు మించి ఎక్కువగా పెరిగిపోతోంది.
e-Amrit: పెట్రోల్, డీజిల్ ధరలు అందుబాటులో లేని స్థాయికి చేరుకున్నాయి. ఇంకా పైపైకి పరుగులు తీస్తున్నాయి. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం కూడా లెక్కలకు మించి ఎక్కువగా పెరిగిపోతోంది. వీటి నుంచి బయటపడటానికి ప్రపంచ దేశాలు సంప్రదాయ ఇంధన వనరులవైపు చూస్తున్నాయి. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నడుం బిగించాయి. మన దేశంలో కూడా ఎలాక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే చర్యలు ఊపందుకున్నాయి. అందులో భాగంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫేమ్(FAME) వంటి సబ్సిడీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని పొందడానికి ఇ-అమృత్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి, వాటి విధానాలు, రాయితీలు, పెట్టుబడి అవకాశాల గురించి తెలుసుకోవడానికి ఇది వన్-స్టాప్ గమ్యస్థానంగా ఉంటుంది. యూకేలోని గ్లాస్గోలో జరుగుతున్న కాప్26 (COP26) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
FAME వంటి పథకాల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు చౌకగా తయారయ్యాయి
ఇటీవలి కాలంలో, వాహనాల నుండి వెలువడే ప్రమాదకర వాయువులను డీకార్బనైజేషన్ చేయడం, ఎలక్ట్రిక్ మొబిలిటీని అనుసరించడం ద్వారా విద్యుత్ భవిష్యత్తుకు పరివర్తనను వేగవంతం చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఫేమ్, పీఎల్ఐ(PLI) వంటి పథకాలు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడాన్ని సులభతరం చేశాయి.
రిజిస్ట్రేషన్ ఛార్జీ, రహదారి పన్నుపై మినహాయింపు
దేశంలోని అనేక రాష్ట్రాలు కూడా తమ సొంత ఎలక్ట్రిక్ వాహన విధానాలను ప్రారంభించాయి. వీటిలో ఎలక్ట్రిక్ టూ, త్రీ, ఫోర్ వీలర్ల కొనుగోలుపై సబ్సిడీ ఇస్తున్నారు. రాష్ట్రాలు ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రహదారి పన్ను నుండి కూడా మినహాయింపు ఇచ్చాయి. ఇ-అమృత్ పోర్టల్ యూకే ప్రభుత్వంతో నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద నీతి ఆయోగ్ అభివృద్ధి చేసింది. దీనిని నీతి ఆయోగ్ హోస్ట్ చేస్తోంది. ఇది యూకే-ఇండియా జాయింట్ రోడ్ మ్యాప్-2030లో ఒక భాగం. ఇందులో ఇరు దేశాల ప్రధానమంత్రులు సంతకం చేశారు. పోర్టల్ ప్రారంభ కార్యక్రమానికి బ్రిటన్‌కు చెందిన హై-లెవల్ క్లైమేట్ యాక్షన్ ఛాంపియన్ నిగెల్ టాపింగ్, నీతి ఆయోగ్ సలహాదారు సుధేందు జ్యోతి సిన్హా హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి: Air Bags for Bikes: బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి.. ఇది ఎలా పనిచేస్తుందంటే..