జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయ్యారు. ప్రస్తుతం సౌదీ పర్యటనలో ఉన్న దోవల్ బుధవారం యువరాజుతో భేటీ అయి కశ్మీర్ అంశంపై భారత ప్రభుత్వ వైఖరిని వివరించినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. దాదాపు ఈ సమావేశం రెండు గంటల పాటు సాగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కశ్మీర్ అంశంలో భారత్ అనుసరిస్తున్న తీరును యువరాజు సమర్థించినట్లు సమాచారం. దీనివల్ల కశ్మీర్ అంశంలో సౌదీ తమకు మద్దతుదారుగా ఉండాలని కోరుకుంటున్న పాకిస్థాన్‌కు ఎదురు దెబ్బ తగిలినట్లవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఇరు దేశాల మధ్య బంధాలు బలోపేతం చేసే ఉద్దేశంతో దోవల్ సౌదీ పర్యటనకు వెళ్లారు. యువరాజుతో జరిగిన సమావేశంలో భాగంగా ద్వైపాక్షిక బంధాలపైనా చర్చలు జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం దోవల్.. సౌదీ భద్రత సలహాదారుతోనూ సమావేశం అయ్యారు. ఇక యూఏఈ నాయకత్వంతోనూ భేటీ అయి కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ పన్నుతున్న కుట్రలను వారి దృష్టికి తెచ్చే అవకాశం ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిణామాలను దోవల్ వారికి వివరించనున్నారు. కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా సౌదీ యువరాజును కలిసిన సంగతి తెలిసిందే. కశ్మీర్ అంశంలో తమకు మద్దతివ్వాలని ఆయన అన్ని దేశాలను అభ్యర్థిస్తున్నారు. చైనా, మలేసియా, టర్కీ మినహా మెజార్టీ దేశాలు కశ్మీర్ విషయంలో భారత్‌కు మద్దతిస్తున్న సంగతి తెలిసిందే.