ఎందరో తమ జీవితాలను అదిలోనే అంతం చేసుకుంటున్నారు. జీవితంలోని సమస్యలను ఎదురించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కొందరు ఆర్థిక ఇబ్బందులు భరించలేక కొందరైతే, తోటి వారి వేధింపులు తాళలేక మరికొందరు, కొందరు అనారోగ్య సమస్యలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. నిండు నూరేళ్లు బతకాల్సిన వారు చిన్న వయసులోనే తనువు చాలిస్తున్నారు. క్రమంగా ఆత్మహత్య సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.
తాజాగా దేశంలో ఆత్మహత్యల పరంగా 2019 కొత్త రికార్డు నమోదు చేసింది. గత 11 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా 1,39,123 మంది గత ఏడాది బలవన్మరణానికి పాల్పడ్డట్టు.. జాతీయ నేర గణాంకాల మండలి తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.
పేదలు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. ఆత్మహత్యలకు ఆర్థిక బంధాలతో ముడిపడి ఉండటం ఒకింత ఆందోళన కలిగిస్తోంది.ఈ జాబితాలో ఏడాదికి రూ.లక్షలోపు ఆదాయం ఉన్న నిరుపేదలు 66.2 శాతం(92,083), లక్ష నుంచి రూ.5 లక్షలలోపు ఆదాయమున్న వారు మరో 29.6 శాతం(41,197) ఉన్నారు. మొత్తం ఆత్మహత్యల బాధితుల్లో రూ.5 లక్షలలోపు ఆదాయమున్న పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలే 95.8 శాతం ఉండటం గమనార్హం. అలానే 70 శాతం మంది తక్కువ చదువుకున్నవారేనని ఈ నివేదిక వెల్లడించింది. ఇందులో నిరక్షరాస్యులు 12.6%, ప్రాథమిక అక్షరజ్ఞానమున్నవారు 16.3%, ఉన్నత పాఠశాల విద్య చదివినవారు మరో 42.9% ఉన్నారు. పెళ్లీడొచ్చినా వివాహం కావడంలేదని 2,331 మంది ఉరితాడు బిగించుకున్నారు.