No second wave threat to Telangana, says Health Minister Eetala Rajendar: తెలంగాణ రాష్టానికి కరోనా వైరస్ సెకెండ్ వేవ్ భయం ఏమాత్రం లేదని వెల్లడించారు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్. తెలంగాణలో కరోనా వైరస్ రెండో స్టేజ్ వ్యాప్తి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అంటున్నారు. ప్రజలు ధైర్యంగా.. అప్రమత్తంగా ఉండాలని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో బుధవారం నాడు ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందని ఈటల అన్నారు. వేలాది మందికి ఉపాధిని దూరం చేసి అల్లకల్లోలం సృష్టించిన కరోనా మన దేశంలో ఫస్ట్ ఫేజ్ కింద పీక్ లెవెల్‌కు వెళ్లి కిందికి రావడం జరిగిందని ఆయన వివరించారు.
బ్రిటన్ లాంటి దేశంలో సెకండ్ వేవ్ పేరిట కరోనా వైరస్ సోకుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యాయని తెలిపారు ఈటల రాజేందర్. విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్టులోనే పరీక్షలు నిర్వహించి.. అవసరం మేరకు ఐసొలేషన్‌కు తరలిస్తున్నామని మంత్రి వివరించారు. పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం తరలిస్తున్నామని తెలిపారు.
చలికాలం ఇంకో నెల రోజులు కొనసాగనున్న నేపథ్యంలో అప్పటి దాకా ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని ఈటల రాజేందర్ సూచించారు. ‘‘ సెకండ్ వేవ్ వస్తది అన్న దానికంటే.. చలి కాలం కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలి.. ఒకవేళ ఏ పరిస్థితి వచ్చిన కూడా దాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సర్వ సన్నద్ధంగా ఉంది.. సెకండ్ వేవ్ రాకూడదని.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఎలా తగ్గిపోయిందో అలాగే ఉండాలని కోరుకుంటున్నా..’’ అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
ALSO READ: చాకోలేట్‌తో బాలుకు నివాళి.. వెరైటీగా బేకరీ సేల్స్
ALSO READ: పీవీఘాట్‌కు పోటెత్తిన రాజకీయ నేతలు.. మాజీ ప్రధాని సేవలను స్మరించిన సీఎం కేసీఆర్