పీవీకి ఘన నివాళులు.. పీవీఘాట్‌కు పోటెత్తిన రాజకీయ నేతలు.. మాజీ ప్రధాని సేవలను స్మరించిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని దివంగత ప్రధాని పీవీ నరసింహారావు సమాధి ఙ్ఞానభూమికి బుధవారం రాజకీయ పార్టీల నేతలు, శ్రేణులు పోటెత్తారు. పీవీ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు నేతలు...

పీవీకి ఘన నివాళులు.. పీవీఘాట్‌కు పోటెత్తిన రాజకీయ నేతలు.. మాజీ ప్రధాని సేవలను స్మరించిన సీఎం కేసీఆర్
Follow us

|

Updated on: Dec 23, 2020 | 3:09 PM

Huge tributes to PV Narasimharao:  తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని దివంగత ప్రధాని పీవీ నరసింహారావు సమాధి ఙ్ఞానభూమికి బుధవారం రాజకీయ పార్టీల నేతలు, శ్రేణులు పోటెత్తారు. పీవీ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు నేతలు ఆయనకు నివాళులు అర్పించేందుకు క్యూ కట్టారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మాజీ ప్రధాని పీవీ సేవలకు స్మరించుకున్నారు. పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణ శీలిగా భారత దేశ చర్రిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి అన్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన తదితర రంగాలలో నరసింహా రావు ప్రవేశపెట్టి, అమలు చేసిన సంస్కరణల ఫలితాన్ని ఇవాళ భారత దేశం అనుభవిస్తున్నదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

అంతర్గత భద్రత వ్యవహారాల్లోనూ, విదేశాంగ వ్యవహారాల్లోనూ పీవీ నరసింహారావు అవలంభించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి భారత దేశ సమగ్రతను, సార్వభౌమాత్వాన్ని పటిష్ఠపరిచిందని కేసీఆర్ కొనియాడారు. బహు భాషా వేత్తగా, బహు ముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలకుడిగా అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పీవీకి ఘనమైన నివాళి అర్పించేందుకే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతతో నిర్వహిస్తున్నదని సీఎం గుర్తు చేశారు.

పీవీ ఘాట్‌లో నివాళులర్పించిన వారిలో ఇటీవల రాజీనామా చేసిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కాంగ్రెస్ సీనియర నేత వి.హనుమంతరావు తదితరులున్నారు. ‘‘ దేశ ప్రజలు పీవీని మరువరు.. పీవీ తెచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లనే దేశం అభివృద్ధి పథంలో ఉంది.. పీవీ తెచ్చిన భూ సంస్కరణలపై కార్యక్రమాలు నిర్వహిస్తాం.. ’’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం ఉదయమే ఙ్ఞానభూమిని సందర్శించి పీవీ ఘాట్‌లో నివాళులు అర్పించారు. ‘‘ పీవీ వ్యక్తి కాదు ఒక శక్తి.. వారు మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు సూచనలు మన వెంట ఉన్నాయి.. శత జయంతి ఉత్సవాలు సీఎం కేసీఆర్, ఎంపీ కేకే ఆధ్వర్యంలో గొప్పగా జరుగుతున్నాయి.. దేశానికి దిక్సూచి పీవీ.. ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మంచి పరిణామం..’’ అని పోచారం వ్యాఖ్యానించారు. శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పీవీ ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. ‘‘ దేశానికి ఒక దిక్సూచి పీవీ నరసింహారావు.. భారత దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు పీవీ.. శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.. ’’ అని అన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. పీవీకి నివాళులు అర్పించిన వారిలో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ ఎంపీ, పీవీ శతజయంతి కమిటీ కన్వీనర్ కే.కేశవరావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా వున్నారు.