కరోనా మహమ్మారి ప్రజా ప్రతినిధులను సైతం వదిలిపెట్టడంలేదు. నిన్న మొన్నటి వరకు ప్రజా కార్యక్రమాల్లో చురుక్కుగా పాల్గొన్న నేతలు ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. ఒకే జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్ రావడంతో జిల్లా నేతల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కరోనాతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు.
గత రెండు రోజులుగా అనారోగ్య లక్షణాలతో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కొవిడ్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఎమ్మెల్యే బాజిరెడ్డితో గణేష్ గుప్తా కాంటాక్ట్ అవ్వడం వల్లే వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. తెలంగాణలో వారం రోజుల వ్యవధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారినపడ్డారు. ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ కరోనాతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు.