SEC vs AP Govt: ఇక పదవీ కాలంపై పోరుబాట.. నిమ్మగడ్డ తాజా వ్యూహానికి సర్కార్ ప్రతివ్యూహం!

ఏపీలో కొనసాగుతున్న ఎన్నికల కమిషనర్ వర్సెస్ ప్రభుత్వం వార్ త్వరలో కొత్త మలుపు తీసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. పంచాయితీ ఎన్నికలు ఎస్ఈసీ, ఏపీ సర్కార్ మధ్య కలహానికి తెరలేపగా.. ఈ కలహం త్వరలో మరో టర్న్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

SEC vs AP Govt: ఇక పదవీ కాలంపై పోరుబాట.. నిమ్మగడ్డ తాజా వ్యూహానికి సర్కార్ ప్రతివ్యూహం!
Follow us

|

Updated on: Jan 30, 2021 | 1:50 PM

Nimmagadda to fight for extension: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల రచ్చ ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) పదవీ కాలంపై చర్చ మొదలైంది. రాష్ట్రంలో అన్ని రకాల లోకల్ పోల్స్‌ని పూర్తి చేసే దాకా పదవిలో వుండేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఆయన ప్రయత్నాలకు ఆదిలోనే గండి కొట్టేందుకు సర్కార్ కూడా పై ఎత్తులు ప్రారంభించినట్లు అమరావతి వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు.. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించే సంకల్పంతో శరవేగంగా చర్యలు తీసుకుంటున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. కనీసం రెండు నెలల పాటు తన పదవీ కాలాన్ని పొడిగించుకునేలా ప్రయత్నాలు షురూ చేసినట్లు తెలుస్తోంది.

ఎస్‌ఇసిగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం పొడిగింపుపై న్యాయస్థానం ఆశ్రయించనున్నారా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పదవీకాలం పొడిగించే అవకాశం వుందా? ఇందుకు ఆయన ప్రయత్నాలను ప్రారంభించారా? తమకు కొరకరాని కొయ్యలా మారిన నిమ్మగడ్డ పదవీకాలం పొడిగించకుండా అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేపట్టిందా? ఈ ప్రశ్నలన్నింటికి అమరావతిలోని విశ్వసనీయ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి.

2016 ఏప్రిల్‌ ఒకటో తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అధికార బాధ్యతలు స్వీకరించారు. నిబంధనల ప్రకారం ఆయన ఐదేళ్ల పాటు పదవిలో ఉండాలి. ఈ లెక్కన నిమ్మగడ్డ రమేశ్ ఈ ఏడాది (2021) మార్చి 31న రిటైర్‌ అవ్వాల్సి వుంది. కానీ నిమ్మగడ్డ వ్యవహారం నచ్చని రాష్ట్ర ప్రభుత్వం మధ్యలోనే ఆయన్ను తొలగించి కనకరాజ్‌ను ఎస్‌ఇసిగా నియమించింది. అయితే న్యాయస్థానాల జోక్యంతో నిమ్మగడ్డ తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు.

తిరిగి నియమకమైన నిమ్మగడ్డ తొలి రోజు నుంచి సర్కార్‌పై పైచేయి సాధించేందుకు చర్యలు తీసుకుంటూనే వున్నారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. కోవిడ్ ప్రభావం, వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్నందున ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎన్నికల కమిషనర్‌తో విభేదించింది. ఉద్యోగులు సైతం కరోనా భయంతో ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని చేతులెత్తేశారు. కానీ పట్టు వీడని నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు రావడంతో సర్కార్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అక్కడా నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు రావడంతో రాష్ట్ర ఎన్నికల ప్రక్రియ ముందుకు కదిలింది. అప్పటి దాకా మొరాయించిన అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా ఎన్నికల ప్రక్రియలో సహకరించాల్సి వచ్చింది.

అయినా కొందరు అధికారులు ఎన్నికల విధులకు సహకరించక పోవడంతో నిమ్మగడ్డ వారిపై గవర్నర్‌కు, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. వీరిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా వుండడం విశేషం. అయితే.. నిమ్మగడ్డ ఫిర్యదు చేసిన అధికారులెవరిపైనా ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇదొక వైపు కొనసాగుతుండగానే నిమ్మగడ్డ పంచాయితీ ఎన్నికలు ముగియగానే మున్సిపల్ ఎన్నికలు.. అవి పూర్తి కాగానే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూడు ఎన్నికలు పూర్తయ్యే దాకా పదవిలో వుండేందుకు కూడా ఆయన పావులు కదుపుతున్నారు.

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ న్యాయపోరాటంలో గెలిచి తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. అయితే ఆ న్యాయపోరాట సమయంలో రెండు నెలల పాటు నిమ్మగడ్డ పదవికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు నెలల కాలాన్ని తిరిగిపొందాలని నిమ్మగడ్డ గట్టిగా భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తన సర్వీసును మార్చి 31తో ముగించకుండా తాను కోల్పోయిన ఆ రెండు నెలలను కలిపి మే 31 దాకా పొడిగించుకోవాలని నిమ్మగడ్డ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన నిర్ణీత ఐదేళ్ల కాలపరమితిలో రెండు నెలల కాలాన్ని కోల్పయాను కాబట్టి ఆ మేరకు తన సర్వీసును మరో రెండు నెలలు పొడిగించుకోవాలని నిమ్మగడ్డ వాదిస్తున్నారు. ఈ మేరకు తన ప్రతిపాదనలను రాష్ట్ర గవర్నర్‌ బి.హరిచందన్‌ను ఇది వరకే కోరినట్లు అమరావతి వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఒక వేళ గవర్నర్‌ ద్వారా పనికాకుంటే కోర్టుకు వెళ్లి తన పదవీకాలాన్ని రెండు నెలల పాటు పొడిగించుకోవాలని నిమ్మగడ్డ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాయింట్‌పై నిమ్మగడ్డను తిరకాసులో నెట్టేందుకు ప్రభుత్వానికి అవకాశం దొరికింది. నిమ్మగడ్డను పదవి నుంచి తీసేసిన ఆ రెండు నెలల కాలానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం జీతం చెల్లించింది. ఈ కారణంగా ఆయనకు పదవీకాలం పొడగింపు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వచ్చేనెల 21వ తేదీతో పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి. వెంటనే ఫిబ్రవరి 22వ తేదీన మున్సిపల్‌ ఎన్నికలకు ఎస్‌ఇసి నిమ్మగడ్డ నోటిఫికేషన్‌ ఇస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి నిఘా వర్గాలు సమాచారాన్ని కూడా అందించినట్లు తెలుస్తోంది.

మున్సిపల్‌ ఎన్నికలు ముగిసే లోపు జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇలా వరుసగా ఎన్నికలు జరగుతూ ఉన్నందున తనను పదవిని కొనసాగించాలనే వాదనను కూడా ఎస్‌ఇసి ముందుకు తీసుకురానున్నారు. ఈ వాదనను కూడా వినిపించి కోర్టు నుంచి పదవీకాలం పొడగింపు పొందాలని నిమ్మగడ్డ స్థిరంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మార్చి 31 తర్వాత ఒక్కరోజు కూడా నిమ్మగడ్డ పదవిలో కొనసాగకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయనుందని సమాచారం. మొత్తమ్మీద ఎన్నికల నిర్వహణపైనే కాకుండా పదవీకాలంపై కూడా సర్కార్‌పై సమరం చేసేందుకు స్టేట్ ఎలెక్షన్ కమిషనర్ రెడీ అవడం ఆసక్తి రేపుతోంది.