కరోనాపై మోడీ కొత్త మంత్రం ఇదే

|

Apr 27, 2020 | 2:35 PM

నెల 15 రోజులుగా దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌పై సమరం సుదీర్ఘకాలం కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. మంగళవారం దేశంలోని ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ప్రధాని కొత్త మంత్రాన్ని దేశ ప్రజలకు ఉపదేశించాలని సంకల్పించారు.

కరోనాపై మోడీ కొత్త మంత్రం ఇదే
Follow us on

నెల 15 రోజులుగా దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌పై సమరం సుదీర్ఘకాలం కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. మంగళవారం దేశంలోని ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ప్రధాని కొత్త మంత్రాన్ని దేశ ప్రజలకు ఉపదేశించాలని సంకల్పించారు.

మంగళవారం సుమారు రెండున్నర గంటల పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో అమలవుతున్న కరోనావైరస్ నియంత్రణ చర్యలను సమీక్షించారు. లాక్ డౌన్ ఆంక్షలను, అవి అమలవుతున్న తీరును ప్రధానమంత్రి తెలుసుకున్నారు.

లాక్‌డౌన్‌తో సానుకూల ఫలితాలు వచ్చాయని మోదీ ప్రకటించారు. ఖచ్చితమైన కరోనా వైరస్ నియంత్రణ చర్యలతోను, పకడ్బందీ ఆంక్షలతోను లక్షల మంది ప్రాణాలను కాపాడుకోగలిగామని ప్రధాని ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల దృష్ట్యా కరోనా వైరస్ ప్రభావం సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం ఉన్నందున రెండు లక్ష్యాలు.. ఇప్పుడు దేశం ముందు ఉన్నాయని ప్రధాని మోదీ ముఖ్యమంత్రులకు ఉద్బోధించారు. ఒకవైపు కరోనా వైరస్ నియంత్రణ చర్యలను కొనసాగిస్తూనే మరోవైపు దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రులకు సూచించారు.

అదే సమయంలో దేశ ప్రజలు మరికొంతకాలం కొన్ని ఆంక్షలను పాటించాల్సిన అవసరం ఉందని, అందులోనూ ‘‘దో గజ్ దూరీ’’ (2 గజాల దూరం) అనేది మన మూల మంత్రం కావాలని మోడీ పిలుపునిచ్చారు. ముఖాలకు మాస్కులు ధరించడం, తరచూ చేతులను శుభ్రపరుచుకోవడం, శానిటైజర్లను విరివిగా ఉపయోగించడం దేశ ప్రజలందరి కర్తవ్యం కావాలని మోడీ పిలుపునిచ్చారు. మాస్కులు, ఫేస్ కవర్లు జీవితంలో భాగం కావాలని అన్నారు.

ఇదిలా ఉండగా గోవా, మేఘాలయ వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశంలో మరికొంత కాలం లాక్ డౌన్ కొనసాగించాల్సి ఉందని ప్రధానమంత్రికి సూచించారు. దేశంలో ఇప్పటికే రెండు విడతలుగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మూడో విడత లాక్ డౌన్ కొనసాగింపుపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గ్రీన్ జోన్లలో పూర్తిస్థాయి సామాన్య జీవనాన్ని తీసుకువచ్చి.. రెడ్, ఆరెంజ్ జోన్లలో మరికొంతకాలం కఠినతరమైన ఆంక్షలను కొనసాగించాలని మోదీ భావిస్తున్నట్లుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరోక్షంగా మెసేజ్ లభించినట్లయింది.