AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Political RoundUp 2020: కమల వికాసం… హస్త విలాపం… ప్రాంతీయ పార్టీల పోరాటం…

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి అహ్మదాబాద్‌ వరకు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది....

National Political RoundUp 2020: కమల వికాసం... హస్త విలాపం... ప్రాంతీయ పార్టీల పోరాటం...
TV9 Telugu Digital Desk
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 01, 2021 | 6:13 AM

Share

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి అహ్మదాబాద్‌ వరకు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. కరోనాతో దేశ ప్రజలు ఇంటికే పరిమితమైనా.. రాజకీయ వేడి ఏ మాత్రం తగ్గలేదు. 2020 ఏడాది దేశ రాజకీయ రంగంలో సంచనాలకు వేదికైంది. ఉత్తరాన కమలం వికసించగా దక్షిణాదికి బాటలు వేసేందుకు పావులు కదిపింది. కాంగ్రెస్ ను తిరుగుబాట్లు కుంగదీయగా టీడీపీని రెబల్స్ ఎమ్మెల్యేలు కునుకు లేకుండా చేశారు. మరోవైపు తెలంగాణలోను టీఆర్ఎస్ కు కాస్తంత బ్రేక్ పడిందనే చెప్పాలి. మొత్తంగా 2020 మిశ్రమ ఫలితాలనిచ్చింది.

బిహార్‌లో నితీష్‌ విజయం…

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగింది. బీజేపీ- జేడీయూ కూటమి విజయం సాధించగా…ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి ఓడింది. మొత్తం 243 స్థానాలకు గాను 124 సీట్లతో బీజేపీ-జేడీయూ కూటమి గెలిచినా ఆర్జేడీ పార్టీ అత్యధికంగా 76 స్థానాలు గెలుచుకుంది. 73 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న సీఎం నితీశ్‌ కుమార్‌ పార్టీ జేడీయూ ఈ సారి 43 స్థానాలకే పరిమితం కావడం విశేషం. విపక్ష మహా కూటమిలో ఆర్జేడీ 76, కాంగ్రెస్‌ 19, లెఫ్ట్‌ పార్టీలు 16 సీట్లలో గెలిచాయి. మహా కూటమికి 111 స్థానాలు రాగా…వాటిలో ఎంఐఎం 5, ఇండిపెండెంట్‌ 1, ఎల్జేపీ 1, బీఎస్పీ 1 స్థానాలను గెలుచుకున్నాయి.

ఎంపీలో కుప్పకూలిన కమల్‌ సర్కార్‌…

కాంగ్రెస్ నేత జోతిరాధిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేసి కమలం తీర్థం పుచ్చుకున్నాడు. సింధియాతో పాటు మరో 22 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో కమల్‌నాథ్‌ సర్కార్‌ పడిపోయింది. ఫలితంగా బీజేపీ సీనియర్‌ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మొత్తం 230 మంది సభ్యులు ఉన్న మధ్యప్రదేశ్‌లో బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాతో ఆ పార్టీకి కేవలం 92 మంది సభ్యులే మిగిలారు. దీంతో సభ బలం 206కు తగ్గగా, మెజారిటీ నిరూపణకు అవసరమైన బలం కేవలం 104 మంది మాత్రమే. ఫలితంగా బీజేపీ సులువుగా గట్టెక్కింది.

రాజస్తాన్‌ లో సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు…

రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌తో విభేదించి 18 ఎమ్మెల్యేలతో హడావుడి చేశారు. నెల రోజుల పాటు సాగిన ఈ వ్యవహారం ఒక కొలిక్కి తీసుకువచ్చేదుకు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు చాలా శ్రమ పడాల్సి వచ్చింది. చివరకు సచిన్‌ వెనక్కి వచ్చారు. ఫలితంగా ప్రభుత్వానికి ఢోకా లేకుండా పోయింది.

రెండు అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు…

సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. దేవుడు శాసిస్తాడు ఈ అరుణాచల్‌ పాటిస్తాడు అంటూ ఇకపై తాను రాజకీయ రంగ ప్రవేశంలేదని ప్రకటించారు. డిసెంబర్‌ 31న పార్టీ ప్రకటన చేస్తానని తొలుత ప్రకటించిన రజనీకాంత్‌ ఆ తరువాత అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో చివరకు పార్టీ ఏర్పాటు నుంచి వెనక్కు తగ్గాడు. కాగా, మరో సీనియర్ నటుడు కమల్ హాసన్ మాత్రం రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు.

కేరళలో ఎల్డీఎఫ్‌ విజయం….

కేరళలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎల్డీఎఫ్‌) స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించింది. గ్రామ పంచాయతీ, బ్లాక్‌ పంచాయతీల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఆ పార్టీదే హవా.

కశ్మీర్‌లోను కమల వికాసం…

జమ్మూకశ్మీర్​ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత మొదటిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి. జమ్మూ కశ్మీర్ డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హావా చాటింది. ఈ ఎన్నికల్లో పీఏజీడీ(గుప్కార్ కూటమి) 110 స్థానాల్లో గెలుపొంది అగ్రస్థానంలో నిలవగా…75 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచిన సింగిల్ పార్టీగా నిలిచింది. ఈ ఫలితాలపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఆర్టికల్‌ 370 రద్దుకు కశ్మీర్‌ ప్రజలు మద్దతు తెలిపారని కేంద్ర హోంశాఖ మం‍త్రి అమిత్‌ షా వ్యాఖ్యానించడం ఆసక్తికరం. ఇక హైదరాబాద్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ పుంజుకుంది.

కరోనా ఎఫెక్ట్…

కరోనాతో ఈ ఏడాది రాజకీయ నేతల పర్యటలు, సభలు, సమావేశాలు అంతగా లేవనే చెప్పాలి. చివరి నెలలో కాస్తంత సమావేశాలు జరగడం మినహా ఏడాదిలో ఎనిమిది నెలలు ప్రజలకు దూరంగా ఉన్నారు నేతలు. డిసెంబర్ 30 నాటికి దేశంలో మొత్తం కరోనా కేసులు 1,02,44,852 కాగా..మొత్తం మరణాలు- 1,48,439గా ఉన్నాయి.

కీలక నేతల కన్నుమూత…

ఈ ఏడాది భారత్ కు చెందిన చాలా మంది కీలక నేతలు కన్నుమూశారు. వారిలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ ఆగస్టు 31న చనిపోగా, కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ సెప్టెంబర్ 27న, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ అక్టోబర్ 8న, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ నవంబర్ 25న, అస్సాం మాజీ సిఎం తరుణ్ గగోయ్ నవంబర్ 23న చనిపోయారు.

Also Read: New Year Celebrations: ఏ దేశం ఎప్పుడు కొత్తేడాదిలోకి అడుగుపెడుతోందో తెలుసా.? మొత్తం 26 గంటలు..