AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vanajeevi Ramaiah: వృక్షో రక్షతి రక్షితః.. ఆయన కలలన్నీ ఆకుపచ్చటి కలలే.. అందరికీ ఆదర్శం వనజీవి జీవితం..

వృక్షో రక్షతి రక్షితః అన్న సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించాడు.. ఆయన కలలన్నీ ఆకుపచ్చటి కలలే.. భూమికి పచ్చాని రంగేయ్యాలని..

Vanajeevi Ramaiah: వృక్షో రక్షతి రక్షితః.. ఆయన కలలన్నీ ఆకుపచ్చటి కలలే.. అందరికీ ఆదర్శం వనజీవి జీవితం..
Pardhasaradhi Peri
|

Updated on: Jan 26, 2021 | 2:11 PM

Share

My India My Duty – Daripalli Ramaiah: వృక్షో రక్షతి రక్షితః అన్న సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించాడు.. ఆయన కలలన్నీ ఆకుపచ్చటి కలలే.. భూమికి పచ్చాని రంగేయ్యాలని ఆయన కోటికి పైగా మొక్కలను నాటాడు.. వాటిని బిడ్డలవలే పెంచుతూ అందమైన భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాడు. వృక్షాలను రక్షిస్తే.. అవి మనల్ని రక్షస్తాయంటూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఆయనే నిర్విరామ హరిత స్వాప్నికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య. 84 ఏళ్ల వయసులో కూడా తాను నమ్మిన సిద్ధాంతానికి పచ్చని బాట వేస్తున్నాడు.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య వృక్షోరక్షతి.. రక్షితః అన్న సిద్దాంతాన్ని బలంగా విశ్వసిస్తూ దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు. ఎలాంటి ఆర్థిక సాయం ఆశించకుండా.. తాను నమ్మిన సిద్దాంతాన్ని 10మందికి తెలిసేలా వనజీవి దంపతులు ప్రచారం చేస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. దరిపల్లి రామయ్య అంటే ఆయన్ను ఎవరూ గుర్తు పట్టరు. అదే చెట్ల రామయ్య, వనజీవి రామయ్య అనగానే తెలుగు రాష్ట్రాల్లోని వారంతా ఆయన్ను గుర్తు చేసుకుంటూ కొనియాడుతుంటారు.

ఖాళీ ప్రదేశం కనిపిస్తే చాలు ఆయన విత్తనాలు చల్లడమో.. లేకపోతే మొక్కలు నాటి రామయ్య ఖమ్మం జిల్లా ప్రాంతంలో నిలువెత్తు వృక్షంలా నీడలా మారారు. ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం వనజీవి రామయ్యకు 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించి సత్కరించింది. అంతేకాకుండా వనజీవి పలు అవార్డులు సైతం దక్కాయి. రామయ్య వయసు ఎనిమిదిపదులు దాటినప్పటికీ.. విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచన కూడా ఆయనకు రాదు. ఇప్పటికీ విత్తనాలు చల్లడం.. మొక్కలు నాటడం.. వాటిని సంరక్షించడమే ఆయన ధ్యేయం. నేలకు పచ్చాని రంగేస్తున్న వనజీవి జీవితం.. సిద్ధాంతం మనందరికీ నిజంగా ఆదర్శమే..

130 కోట్లకుపైగా జనాభా ఉన్న మన దేశంలో.. ఇలాంటి కొంత మంది ఎలాంటి ప్రభుత్వ సహయం కోసం ఎదురు చూడకుండా.. ఎవరి సాయం ఆశించకుండా సొంత శక్తితో దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారు. అందుకే ఈ గణతంత్ర దినోత్సవం రోజున మనందరం కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తామని శపథం చేద్దాం. వారిలాగే మీరు కూడా ఏదైనా సమాజ సేవలు చేసినట్లైయితే.. మీరు చేసిన ఆ సేవలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఫేస్‏బుక్‏లో #MyIndiaMyDutyతో షేర్ చేయండి. అలాగే TV9 తెలుగు పేజీతో ట్యాగ్ చేయండి.