తెలంగాణలో ఎన్నికల నగారా మోగేందుకు రంగం సిద్దమవుతోంది. మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. జనవరి మూడో వారం నుంచి ఫిబ్రవరి తొలి వారం మధ్యలో మునిసిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగా మునిసిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రాథమిక కసరత్తును మరింత ముమ్మరం చేసింది రాష్ట్ర మునిసిపల్ శాఖ.
రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీల్లో 3149 వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేశారు. వార్డుల విభజనపై విడివిడిగా 131 ఉత్తర్వులను మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ జారీ చేసింది. త్వరలోనే వార్డుల వారీగా ఎలక్టోరల్ రోల్స్, బీసీ ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు అధికారులు.
తాజా సమాచారం ప్రకారం జనవరి తొలివారంలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. సంక్రాంతి తరువాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. జనవరి నెలాఖరుకల్లా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని తలపెట్టారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. ఫిబ్రవరి తొలివారంలో మునిసిపాలిటీల్లో కొత్త పాలక మండళ్ళు బాధ్యతలు స్వీకరిస్తాయి.