నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక తల్లి, కూతుళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన జిల్లాలోని భైంసా పట్టణంలో జరిగింది. భైంసాలోని రాంనగర్ లో తల్లి భాగ్యశ్రీ (39)తో కూతురు సిన్ని(20) కలసి నివాసముంటోంది. మహారాష్ట్ర నుంచి వలసవచ్చి పట్టణంలో ఉంటున్న భాగ్యశ్రీ, శివరాజ్ దంపతులకు ఒక కూతురు. స్థానికంగా వ్యాపారం నిర్వహించిన శివరాజ్ అప్పులు ఎక్కువ కావడంతో అతడు ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. దీంతో భాగ్యశ్రీ టైలరింగ్, బ్యూటీషియన్‌గా పనిచేస్తూ కూతురు సిన్నిని ఎంబీబీఎస్ చదువుతోంది. కరోనా కాలంలో పని దొరకకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడడంతో కుటుంబపోషణ కష్టం మారింది. దీంతో కూతురితో కలిసి భాగ్యశ్రీ ఇంట్లోనే సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సిన్ని ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని కామినేని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది.